ఫోన్ లోనే విడాకులు తీసుకున్న భర్త

Update: 2018-12-20 06:21 GMT

వాట్సాప్ కాల్ చేసి భార్యకు త్రిపుల్ తలాఖ్ చెప్పాడో భర్త. వివాహ సంబంధం తెగిపోయిందంటూ ఫోన్ పెట్టేశాడు. నివ్వెరపోయిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన సమియా భానుకు టోలిచౌకిలో ఉండే మహ్మద్ మెజిమిల్ షరీఫ్ తో రెండేళ్ల క్రితం వివాహమైంది. టోలిచౌకి ఎం.డి.లైన్స్ లోని జెమ్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తాడు షరీఫ్. పెళ్లైన కొంతకాలం పాటు సజావుగానే సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భార్య సమియా భానును వదిలించుకుని.. మరో పెళ్లి చేసుకోవాలని భావించాడు షరీఫ్. నిత్యం భార్యకు నరకం చూపేవాడు షరీఫ్. అనుమానించడం, శారీరకంగా, మానసికంగా వేధించడంతో వేధింపులు తాళలేని ఈ ఇల్లాలు తన పుట్టింటికి చేరింది.

ఆందోళనకు దిగిన ఇల్లాలు

తన భర్త షరీఫ్ నుంచి ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది. భర్త మనస్సు మారిందని భావించిన ఈ ఇల్లాలు సంబరపడిపోతూ ఫోన్ రిసీవ్ చేసుకుంది. అంతలో పిడుగులాంటి వార్త. ఇక నుంచి నీకు, నాకు సంబంధం లేదు.. తలాఖ్, తలాఖ్, తలాఖ్ అంటూ ఫోన్ పెట్టేశాడు భర్త. ఊహించని పరిణామంతో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఫోన్ చేసిన భర్త షరీఫ్ ట్రిపుల్ తలాఖ్ చెప్పడంతో న్యాయం చేయాలని వేడుకుంటోంది బాధితురాలు. భర్త ఇంటి ముందుతో పాటు.. అతను పనిచేసే పాఠశాల ఎదుట కూడా సమియా భాను ఆందోళనకు దిగడంతో అక్కడి నుంచి పరారయ్యాడు భర్త షరీఫ్. తనలా మరో ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా కాపాడాలని కోరుతోంది బాధితురాలు సమియా భాను. చట్టరీత్యా ట్రిబుల్ తలాఖ్ చెల్లదని.. అతనిపై వరకట్న వేధింపులకు సంబధించిన ఐపీసీ 498 ఏ, 406, 506, 4, 5 సెక్షన్లు, డీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Similar News