పాకిస్తాన్ లో హిందూ మహిళ పోరు

Update: 2018-07-06 13:04 GMT

పాకిస్తాన్ లో హిందువుల దయనీయ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో మైనారిటీ మతస్థులు ఎంతో చిన్నచూపుకు, వివక్షకు గురవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగానే హిందువుల జనాభా కూడా తగ్గుతూ వస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఓ హిందూ మహిళ పాకిస్తాన్ లో హాట్ టాపిక్ గా మారింది. సింధ్ ప్రావిన్స్ లోని తారక్ పూర్ జిల్లాలోని సింధ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు హిందూ మహిళ సునీత పార్మర్ ముందుకొచ్చారు. అయితే, ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనుంది. జులై 25వ తేదీన ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి.

సింహంతోనైనా పోరాడగలం

ఎన్నికల్లో పోటీ చేసేందుకు 31 ఏళ్ల సునీత ప్రధానంగా మహిళా సమస్యలను ఆయుధంగా మలుచుకుంటున్నారు. 21వ శతాబ్ధంలో కూడా మహిళలకు కనీస విద్య, వైద్యం అందడం లేదని, తాను గెలిస్తే ఈ పరిస్థితిలో మార్పు తెస్తానంటున్నారు. గత ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మహిళలు బలహీనులు కాదని, సింహంతోనైనా పోరాడగల శక్తి మహిళలకు ఉందని ధైర్యంగా చెబుతున్నారు. సునీత పోటీ చేస్తున్న తారక్ పూర్ జిల్లాలో మొత్తం 16 లక్షల జనాభాలో హిందువుల జనాభా 8 లక్షలుగా ఉంది. అయితే, మార్చిలో కూడా కృష్ణ కుమారి కోల్హి అనే హిందూ మహిళను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేట్ కి నామినేట్ చేసింది. మొత్తానికి పాకిస్తాన్ హిందూ మహిళలు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటం మంచి పరిణామం.

Similar News