ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

Update: 2018-08-14 10:07 GMT

కాంగ్రెస్ ఎమ్మల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ పై అసెంబ్లీ బహిష్కరణ వేటు అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సింగిల్ బెంచ్ మరోసారి షాక్ ఇచ్చింది. రాష్ట్ర చట్టసభల చరిత్రలోనే తొలిసారిగా హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 17వ తేదీన తమముందు హాజరుకావాలని ఆదేశించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతభత్యాల వివరాలు, అసెంబ్లీ రిజిస్టర్ తమకు సమర్పించాలని చెప్పింది. తమపై అక్రమంగా విధించిన బహిష్కరణను సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు ఇద్దరు హైకోర్టుకు వెళ్లగా బహిష్కరణ చెల్లదని తీర్పునిచ్చింది. వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో మళ్లీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ పిటీషన్ దాఖలు చేశారు. ఇక ఎమ్మెల్యేలకు గన్ మెన్లు ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని నల్గొండ, జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఎమ్మెల్యేల బహిష్కరణ విషయంలో ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Similar News