టీడీపీ చేసిన ప‌నితో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది

Update: 2018-07-20 15:00 GMT

కాంగ్రెస్‌తో చేతులు క‌లిపి తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టింద‌ని, ఈ చ‌ర్య‌తో ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌మూరి తార‌క‌రామారావు ఆత్మ క్షిభిస్తుంద‌ని బీజేపీ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు పేర్కొన్నారు. అవిశ్వాసంపై చ‌ర్య సంద‌ర్భంగా లోక్‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ...ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పార్టీ స్థాపించి జీవితాంతం కాంగ్రెస్ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా పోరాడార‌ని గుర్తు చేశారు. టీడీపీకి ఎవ‌రితోనైనా స్నేహం చేసే హ‌క్కు ఉంద‌ని, కానీ, ఈ రోజు ఆ పార్టీ తీసుకున్న నిర్ణ‌యం రాష్ట్రానికి మాత్రం మంచిది కాద‌న్నారు. స‌భ‌లో ఆ పార్టీ నేత‌లు కాంగ్రెస్ నేత‌ల‌తో మంత‌నాలు చేస్తున్నార‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఇచ్చిన హామీల అమ‌లుపై బీజేపీకి చిత్త‌శుద్ధి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌త్యేక హోదా అనే పేరు త‌ప్ప అన్నీ ఇస్తున్నాం

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని బీజేపీ హామీ ఇవ్వ‌డం వాస్త‌వ‌మే అని కానీ 14వ ఫైనాన్స్ క‌మిష‌న్ సిఫార్సుల మేర‌కు ప్ర‌త్యేక హోదా సాధ్యం కానందునే అవే స‌దుపాయాలు స్పెష‌ల్ ప్యాకేజీ ద్వారా ఇస్తున్నామ‌ని తెలిపారు. హోదా అనే పేరు త‌ప్ప హోదా ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాల‌న్నీ కేంద్ర ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంద‌న్నారు. విదేశీ రుణాలు తీసుకోవ‌డంలో ఎఫ్ార్‌బీఎం స‌మ‌స్య వ‌స్తుంద‌నే ఉద్దేశ్యంతో కేంద్రం ఎస్పీవీ ఏర్పాటుచేసుకోవాల‌ని రాష్ట్రానికి సూచిస్తే రాష్ట్రం స్పందించ‌లేద‌ని పేర్కొన్నారు. ఎన్సీవీ ఏర్పాటు చేస్తే రేపే డ‌బ్బులు కేంద్రం మంజూరు చేస్తుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యేక హోదాపై చిత్త‌శుద్ధి లేద‌ని, ఉంటే చ‌ట్టంలో ఎందుకు చేర్చ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

 

Similar News