సవాల్ గా తీసుకుందాం....!

Update: 2018-10-12 13:06 GMT

తెలంగాణలో ముందస్తు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర పోలిస్ శాఖతో సమావేశమైంది. హైదరాబాద్ లోని జలమండలిలో దాదాపు 5గంటల పాటు సుదీర్ఢంగా భేటి నిర్వహించింది. ఎన్నికల నిర్వహణ, భద్రత పరమైన అంశాలపై చర్చించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, 8మంది కమీషనర్లు, 31 మంది ఎస్పీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

శాంతిభద్రతలపై....

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత అన్ని పార్టీల నేతలు ప్రచారాన్నిజోరుగా కొనసాగిస్తున్నారు. గడపగడపనా ఊరూరా ప్రచారాన్నివినూత్న రీతిలో చేపడుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే అసలు ఎన్నికలు నిర్వహణ, శాంతిభద్రతల పర్యావేక్షణపై ఎన్నికల కమిషన్ దృష్టి కేంద్రీకరించింది. ప్రశాంత వాతావరణంలో తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర పోలిస్ శాఖతో భేటి అయ్యింది. ఎన్నికల నిర్వహణతో పాటు శాంతి భద్రతలపై చర్చించింది. ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నేతృత్వంలో డిప్యూటి ఎన్నికల అధికారి ఆమ్రా పాలి ఎన్నికల నిర్వహణ, ఈవిఎంల పరిశీలన, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. అన్ని అంశాలపై తీసుకొవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన ఎన్నికల నియమావళిపై పోలీసులతో చర్చించారు.

ప్రశాంత వాతావరణంలో.....

ఈసీ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తీసుకొవాల్సిన చర్యలపై అవగాహనతో పాటు శిక్షణ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఈవిఎంల ప్యాట్స్ పరిశీలన, సీ విజిల్, సువిధ యాప్ ను పోలీసులు ఎలా వినియోగించుకోవాలో ఎన్నికల కమిషన్ ఈ సమావేశంలో పోలీసు అదికారులకు శిక్షణ ఇచ్చింది. జిల్లాల పోలీసులతో ఎలా సమన్వయం చేసుకోవాలో సూచించింది. శిక్షణలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎలా గుర్తించాలి అనే వాటిపై కూడా ఎన్నికల కమిషన్ ఎస్పీలతో చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పోలీసులను వినియోగించుకోవాలన్న విషయంపై చర్చించింది. అయా జిల్లాలో ఇప్పటికే రౌడిషీటర్లను బైండోవర్ తో పాటు లైసెన్స్ తుపాకులను డిపాజిట్ చేయాలని సూచించామని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు.

పోలీసుల బదిలీలు....

ఇక 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని బదిలీలు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈనెల 17వ తేదీలోగా పోలీస్ శాఖ లో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర పోలిస్ బాస్ తెలిపారు. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పక్క రాష్టాల పోలీసులతో కూడా సమన్వయం చేసుకొని ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఈసీ సూచించిందని మహేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని పకడ్బందీగా చర్యలు తీసుకొవాలని పోలిస్ శాఖకు సూచించింది ఎన్నికల కమిషన్. ఎన్నికల్లో తెలంగాణలో నక్సలైట్ల ప్రభావం లేకుండా చూస్తామని పోలిస్ అదికారులు ఈసికి వివరించినట్లు తెలుస్తోంది. కింది స్థాయి పోలిస్ అధికారులతో పై స్థాయి అధికారులకు పూర్తి అవగాహన ఎలా జరపాలన్న విషయన్ని ఎన్నికల కమిషన్ చర్చించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా అయా జిల్లాలో భద్రత, మావోయిస్టు ప్రాంతాల్లో పోలీసులు వ్యూహం తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు పోలిస్ శాఖ సిద్ధంగా ఉందని పోలిసులు ఎన్నికల కమిషన్ కు క్లారిటి ఇచ్చినట్లు సమాచారం. రౌడీయిజం, రౌడీ షీటర్ల బైండ్ ఓవర్ కేసులతో పాటు ఎన్నికల సమయంలో కేంద్ర బలగాల మొహారింపు అంశాలపై చర్చించింది. సామాన్యులు తమ ఓటు హక్కును ప్రశాంతం వాతావరణంలో వినియోగించుకునేందుకు వీలుగా అన్ని భద్రత పరమైన అంశాలను ఈ సమావేశం చర్చించారు.

Similar News