చిరంజీవిని కష్టకాలంలో వదిలేసిన వ్యక్తి పవన్

Update: 2018-11-14 13:00 GMT

పార్టీ ఓడిపోయాక కష్టకాలంలో స్వంత అన్న చిరంజీవికి అండగా ఉండని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కురసాల కన్నబాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను స్కూటర్ పై చిరంజీవి వద్దకు వచ్చేవాడినని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తాను చాలా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి జర్నలిస్టుగా 18 సంవత్సరాలు పనిచేశాన్నారు. చిరంజీవి ఆహ్వానిస్తేనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయనే టిక్కెట్ ఇచ్చి గెలిపించారన్నారు. తాను చిరంజీవి వల్లే రాజకీయంగా ఈస్థాయికి వచ్చానని చెప్పే ధైర్యం ఉందని, చిరంజీవి వల్లే ఎదిగానని పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. చిరంజీవితో పాటు తాను కాంగ్రెస్ లోకి వెళ్లానని, అదే పవన్ కళ్యాణ్ పార్టీ ఓడిపోగానే అన్నను వదిలేశారన్నారు.

రాజకీయాలు సినిమా కాదు...

తాను నిజంగానే స్కూటర్ పైనే వెళ్లేవాడినని, ఓ సాధారణ జర్నలిస్టు స్కూటర్ పై కాకుండా బెంజి కారులో వెళ్తారా అని ప్రశ్నించారు. తన అన్న మెగాస్టార్ అయి ఉంటే తాను కూడా కారులో వెళ్లి డ్యూటీ చేసేవాడినని పేర్కొన్నారు. కానిస్టేబుల్ కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటే తప్పులేనిది ఒక జర్నలిస్టు ఎమ్మెల్యే కావడం తప్పా అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి తాను కారణమని చిరంజీవితో చెప్పించగలరా అని సవాల్ చేశారు. వైఎస్సార్ తో ఉన్న నాయకులు 90 శాతం జగన్ తో వచ్చారని, చిరంజీవితో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ తో ఎంతమంది వచ్చారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. సినిమా షెడ్యూల్ మాదిరిగా అప్పుడప్పుడు బయటకు వచ్చి రాసిచ్చిన స్క్రిప్టు పవన్ కళ్యాణ్ చదువుతున్నాడని పేర్కొన్నారు.

Similar News