జయరాం హత్యపై వీడని చిక్కుముడి

చిగురుపాటి జయరామ్‌ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన మేనకోడలు శిఖాచౌదరి స్పష్టం చేసింది. పోలీసుల ఎదుట ఆమె అనేక కీలక విషయాలను వెల్లడించింది. తనకు [more]

Update: 2019-02-03 12:39 GMT

చిగురుపాటి జయరామ్‌ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన మేనకోడలు శిఖాచౌదరి స్పష్టం చేసింది. పోలీసుల ఎదుట ఆమె అనేక కీలక విషయాలను వెల్లడించింది. తనకు రెండు పెళ్లుల్లు అయ్యాయని.. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నానని చెప్పింది. డేటింగ్‌ చేశానని.. రెండో భర్తను వదిలివేయడానికి అతనే కారణమని తెలిపింది. రెండో భర్తతో బ్రేకప్ అయ్యాక రాకేష్ రెడ్డిని పెళ్లి చేసుకుందామనుకున్నానని.. కానీ జయరామ్‌ వల్ల అతనికి దూరం కావాల్సి వచ్చిందని చెప్పింది.

జయరామ్‌కి రాకేష్‌రెడ్డిని తానే పరిచయం చేశానన్న శిఖా.. రాకేష్‌కి సొంత వ్యాపారాలేవీ లేవని చెప్పింది. పెద్దపెద్ద వ్యక్తుల వద్ద రాకేష్‌ పనిచేశాడని.. ఆ సమయంలోనే జయరామ్‌కు నాలుగున్నర కోట్లు అప్పుగా ఇచ్చాడని తెలిపింది. చెక్ పవర్ జయరామ్‌ భార్య చేతిలో ఉందని.. ఈ కారణంగా ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని..చాలా మంది వద్ద అప్పులు చేశాడని చెప్పింది. రాకేష్‌ వద్ద తీసుకున్న డబ్బు సకాలంలో చెల్లించకపోవడంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలిపింది. ఐతే.. జయరామ్‌ను రాకేష్‌ చంపుతాడని అనుకోలేదని చెప్పింది

‘తరచూ నా విల్లాకి జయరామ్‌ వస్తుండటంతో రాకేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఒకసారి మేమిద్దరం ఇంట్లో ఉండగా రాకేష్ వచ్చి మావయ్యతో గొడవ పడ్డాడు. డబ్బుల విషయంలో కూడా తరచూ గొడవలు పడ్డాడు. ఆ తర్వాత మావయ్య వల్లే తనకి నేను దూరమయ్యానని రాకేష్ మా ఇద్దరి మీదా కోపం పెంచుకున్నాడు. ఒక రోజు రాకేష్‌ నా విల్లాకు వచ్చి గ్లాస్ టేబుళ్లు పగలగొట్టాడు. రాకేష్‌తో గొడవులు జరుగుతున్న సమయంలోనే శ్రీకాంత్ పరిచయం అయ్యాడు’ అని శిఖా చెప్పింది.

హత్య జరిగిన రోజు తాను, శ్రీకాంత్‌ వికారాబాద్‌ లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లామని.. ఉదయం ఆరు గంటలకి తన తల్లి ఫోన్ చేసి మావయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పిందని శిఖా వివరించింది. ఆ తర్వాత తాను, శ్రీకాంత్‌ కలిసి జయరామ్‌ ఇంటికి వెళ్లి తనకు రాసిచ్చిన పదెకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం వెతికామని చెప్పింది. ఆ తర్వాత జయరామ్‌ను చూడ్డానికి విజయవాడ వెళ్లానని వివరించింది. అప్పుడే బెజవాడ పోలీసులు తనను రమ్మని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లానని చెప్పిన శిఖాచౌదరి.. మావయ్య జయరామ్‌ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాదని తెలిపింది. తనతోపాటు తన సోదరిని కూడా లైంగికంగా వేధించారని ఆరోపించింది.

Tags:    

Similar News