టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు...!!!

Update: 2018-11-28 13:57 GMT

పాతరోజులు తనకు జ్ఞాపకం వస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ అభిమానం చూస్తుంటే రేపు జరిగే ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం తథ్యమని చంద్రబాబు తెలిపారు. సనత్ నగర్ లో రాహుల్ గాంధీతో కలసి రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు హైదరాబాద్ నగరం విజ్ఞాన కేంద్రమన్నారు. పాతరోజులు ఎందుకు గుర్తుకొస్తున్నాయంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకస్మిక తనిఖీలతో హైదరాబాద్ గల్లీ గల్లీకి తిరిగానన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఆనాడు కులీ కుతుబ్ షా నిర్మాణం చేస్తే ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీయే హైదరాబాద్ ను ముందుకు తీసుకెళ్లాయన్నారు. తాను హైదరాబాద్ నగరాన్ని ఎన్నడూ కట్టలేదని, సైబరాబాద్ నగరాన్ని మాత్రం తానే కట్టానని చెప్పారు. తాను ఎప్పుడైనా కేసీఆర్ ను తిట్టానా? ఆయన మాత్రం తనను ఎందుకు తిడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. తాను పెత్తనం చేయడం కోసం ఇక్కడకు రాలేదని, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే వచ్చానని బాబు తెలిపారు.

నేనే కారణమా?

నరేంద్ర మోదీ పాలనలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. దేశంలో అసహనం పెరిగిపోయిందన్నారు. మైనారిటీలపైనా, ఎస్సీలపైనా దాడులు జరుగుతున్నాయని, ఇది ఆందోళనకరమైన విషయమన్నారు. దేశమంతా భయభ్రాంతులను చేస్తున్నారు. నరేంద్ర మోదీతో పాటు కేసీఆర్ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఎవరి పని చేసుకోవాలన్నారు. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతు పలకలేదా? అని టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. 12 సీట్లతో తాను ఇక్కడ ఏం చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోదండరామ్ నేతృత్వంలో తమ పార్టీ పనిచేస్తుందన్నారు. దళితుడిని సీఎం చేస్తానంటే తాను అడ్డం పడ్డానా? దళితులకు మూడెకరాలు ఇస్తానంటే వద్దన్నానా? ఆయన సచివాలయానికి పోకపోవడానికి కూడా నేనే కారణమా? అని చంద్రబాబు కేసీఆర్ ను ప్రశ్నించారు. కుడిచేత్తో అసెంబ్లీ రద్దు పత్రాన్ని ఇస్తే దానిని గవర్నర్ ఎడమచేత్తో నిమిషాల్లో ఆమోదించారన్నారు. మోదీతో కుమ్మక్కై కేసీఆర్, జగన్ లు పనిచేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు తెలంగాణలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు.

Similar News