చంద్రబాబుపై జగన్ భారీ పంచ్ లు...!

Update: 2018-05-23 13:01 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. బుధవారం ఉంగుటూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. సాయంత్రం గణపవరంలో జరిగిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ...చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో కూడా చంద్రబాబు పాల్గన్నానని చెబుతున్నారని, కనీసం అప్పటికి ఆయన లాగు అయినా వేసుకున్నాడా అని ప్రశ్నించారు. ఒకవేళ చంద్రబాబు అప్పటికే ముఖ్యమంత్రిగా ఉంటే మాకు స్వాతంత్రం వద్దని ప్యాకేజీ కావాలని అడిగేవారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు గొప్పలు చెప్పడం మామూలుగా ఉండదని, సత్య నాదెళ్లకు, పి.వి.సింధూకి తానే స్ఫూర్తి అంటాడని, అమరావతికి ఒలంపిక్స్ తెస్తానని చెవిలో పువ్వులు పెడతాడని అన్నారు. ప్రైవేటు జెట్ లలో విదేశాలకు వెళ్తాడని, ఏ దేశం వెళితే తిరిగివచ్చి ఆ దేశం పాట పాడతాడని విమర్శించారు. నాలుగేళ్లలో 4 లక్షల ఇళ్లు కట్టలేని వ్యక్తి ఏడాదిలో 19 లక్షల ఇళ్లు కడతానని అంటున్నాడని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే దళారీ వ్యవస్థను రూపుమాపుతామని పేర్కొన్నారు. చేపల చెరువుల రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కొత్త పెళ్లికూతురి కోసం వెతుకుతున్నారు...

నాలుగేళ్ల పాటు బీజేపీతో జట్టుకట్టిన చంద్రబాబుకు కొల్లేరు, ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని, ఎన్నికలు మరో ఏడాది ఉన్నాయనగా బీజేపీతో విడాకులు తీసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ కొత్త పెళ్లికూతురు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని సంతలో పశువులను కొన్నట్లు కొన్న చంద్రబాబుకు కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందనే నైతిక హక్కు బాబుకు ఉందా అని జగన్ ప్రశ్నించారు.

Similar News