చిన్న వాడివైనా చేతులెత్తి దండం పెడుతున్నా

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కాపిటల్ అని మాత్రమే ఉందని, కాపిటల్స్ అనే పదం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అలాగే శివరామకృష్ణన్ కమిటీలో కూడా కేంద్ర, [more]

Update: 2020-01-20 15:22 GMT

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కాపిటల్ అని మాత్రమే ఉందని, కాపిటల్స్ అనే పదం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అలాగే శివరామకృష్ణన్ కమిటీలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తాయని చెప్పారన్నారు. ఏపీకి రాజధాని అవసరం ఉందనే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేశారన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపిందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి వైపు మొగ్గు చూపిందని చంద్రబాబు తెలిపారు. 4700 మంది అభిప్రాయాలను తీసుకుంటే 46 శాతం గుంటూరు, విజయవాడల మధ్య రాజధాని ఉండాలని చెప్పారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా రాజధానిని మార్చాలని ఆలోచించారా? అని ప్రశ్నించారు. జగన్ కు ఆ అధికారం లేదన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ఇక్కడే జరుగుతుందన్నారు. విశాఖకు వెళ్లాలంటే రాయలసీమ వాసులు 21 గంటలు ప్రయాణం చేయాలన్నారు. విశాఖపట్నంలో తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు.

విశాఖ అంటే ప్రేమ….

విశాఖలో రాజధాని పెడితే శ్రీకాకుళం అభివృద్ధి అవుతుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. భావతరాల కోసం రాగద్వేషాలకు అతీతంగా అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నానని చెప్పారు. ఇప్పుడున్న అసెంబ్లీ తాత్కాలికం కాదని తెలిపారు. ఇక్కడే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఉంటే లక్ష కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలన్నారు. మందబలం ఉందని బిల్లును పాస్ చేసుకుని వెళితే భవిష్యత్తులో ప్రజలే నిర్ణయం చెబుతారన్నారు. విశాఖపట్నం అంతే తనకు ఎనలేని ప్రేమ అని అన్నారు. విశాఖ సుందరనగరంగా ఉండాలని ఎప్పటికీ కోరుకుంటామన్నారు. అమరావతికి ప్రత్యేకంగా నిధులు వెచ్చించాల్సిన పనిలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన రిపోర్టులన్నీ బోగస్ అని చంద్రబాబు అన్నారు. అమరావతిలో పనులు ఆపేయడంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు రెక్కలు వచ్చాయన్నారు. తనకు జగన్ పై ఎటువంటి కోపం లేదని, తనకంటే చిన్నవాడైనా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు కోరారు. మూర్ఖంగా వెళితే రాజకీయంగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు.

Tags:    

Similar News