రూ.150 కోసం కక్కుర్తి...800 కోట్ల బండారం బట్టబయలు

Update: 2018-07-23 13:42 GMT

వందల కోట్ల ఆస్తి ఉన్న ఓ బడా వ్యాపారి కేవలం రూ.150 కోసం కక్కుర్తి పడి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. రూ.800 కోట్ల ఆస్తుల ఆదాయ పన్ను శాఖ చేతుల్లో పెట్టాడు. బెంగళూరుకు చెందిన అవినాష్ అమర్ లాల్ కు అక్కడి ది బౌరింగ్ క్లబ్ లోని బ్యాడ్మింటన్ రూంలో మూడు లాకర్లు ఉన్నాయి. వీటికి ఇంతకుముందు ఒక్కో లాకర్ కు రూ.5 చొప్పున వసూలు చేశారు. తాజాగా దానిని రూ.50కి పెంచారు. వీటికి గానూ అవినాష్ నెలకు రూ.150 చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేదు. రూ.150 కోసం అవినాష్ ను అడిగీ విసిగిపోయిన సిబ్బంది వాటిని వేరే వారికి కేటాయించేందుకు పగలగొట్టారు.

పత్రాలు ఇస్తే చాలని బతిమాలినా...

దీంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వాటిలో కోట్ల రూపాయల డబ్బు, వజ్రాలు, ఆస్తి పత్రాలు బయటపడటంతో పోలీసులకు, ఇన్ కం ట్యాక్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అవినాష్ క్లబ్ వద్దకు చేరుకుని డబ్బు ఉంచుకోవాలని, తనకు పత్రాలు ఇస్తే చాలని కాళ్లావేళ్లా పడ్డా సిబ్బంది ఒప్పుకోలేదు. ఇన్ కం ట్యాక్స్ అధికారులు మొత్తం రూ.3.96 కోట్ల నగదు, రూ.8 కోట్ల విలువైన వజ్రాలు, సుమారు రూ.800 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, చెక్కులు స్వాదీనం చేసుకున్నారు. అవినాష్ సభ్యుడిగా ఉన్న మిగతా క్లబ్ ల నుంచి కూడా పలు పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. అయితే, అవినాష్ కొందరు రాజకీయ నాయకులు, అధికారులకు బినామీగా ఉన్నట్లు ఇన్ కం ట్యాక్స్ అధికారులు భావిస్తున్నారు.

Similar News