ట్రాఫిక్ పై టెక్కీ వింత నిరసన

Update: 2018-06-16 12:49 GMT

అనేక ఏళ్లుగా పడుతున్న ట్రాఫిక్ కష్టాలపై నిరసన తెలపాలనుకున్నాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇందుకోసం అతడు ఓ వింత ఆలోచన చేశాడు. రోజువారీగానే ఫార్మల్ డ్రెస్ వేసుకుని, భుజానికి ల్యాప్ టాప్ తగిలించుకుని ఓ గుర్రం ఎక్కాడు. గుర్రంపైనే ఆఫీసుకు వెళ్లాడు. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారిపోయాయి. వివారాల్లోకెళ్తే... బెంగళూరుకు చెందిన రూపేశ్ కుమార్ వర్మ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఉద్యోగం మానేసి ఓ స్టార్ట్ ఆప్ పెట్టేందుకు ఆయన అంతా సిద్ధం చేసుకున్నాడు. తాను ఇన్నేళ్లుగా ఉద్యోగానికి వెళ్లడానికి ట్రాఫిక్ తో పడ్డ కష్టాలపై నిరసన తెలపాలనుకుని ఓ గుర్రంపై ఆఫీసుకు వెళ్లాడు.

బెంగుళూరు ట్రాఫిక్ తో.....

ఆఫీసు వద్ద సెక్యూరిటీ అడ్డు చెప్పగా, ఇదే తన వాహనమని వాదించి మరీ గుర్రంలో కార్యాలయ ప్రాంగణానికి వెళ్లాడు. తాను బెంగళూరు ట్రాఫిక్ తో, కాలుష్యంతో అనేక బాధలు పడ్డానని, వాటిపై నిరసన తెలపడానికే ఇలా వచ్చానని రూపేశ్ స్పష్టం చేశారు. అయితే, రూపేశ్ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ఉపశమనం అని ఒకరు, ఉద్యోగానికి చివరి రోజు రాజులా వెళ్లాడని మరొకరు, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం ఇలా ఉందని ఒకరు, ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తంమీద ఆఫీసుకి వెళ్లడానికి గుర్రం ఎక్కిన రూపేశ్ సోషల్ మీడియా, పత్రికలు, టీవీల్లో వార్తల్లో వ్యక్తిగా మారారు.

Similar News