బీజేపీకి మరిన్ని టాస్క్ లు ఇస్తారటగా?

ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

Update: 2021-11-30 03:20 GMT

ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో యుద్ధానికి సిద్ధమయ్యారు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ గెలిచిన మాదిరి మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీపై ఒంటి కాలి మీద లేవడమొక్కటే మార్గమని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందుకే బీజేపీని కేసీఆర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. గత ఏడు సంవత్సరాల్లో ఎన్నడూ కేసీఆర్ నోట వినని మాటలను వింటున్నాం.

వెస్ట్ బెంగాల్ తరహాలోనే....
పశ్చిమ బెంగాల్ లోనూ కాంగ్రెస్ పెద్దగా లేదు. మమత బెనర్జీ తొలి నుంచి బీజేపీని టార్గెట్ చేసుకుంటూ వెళ్లారు. బీజేపీపైనా, వ్యక్తిగతంగా మోదీ, అమిత్ షాలపైన కూడా ఆమె విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు చెలరేగుతాయని చెప్పారు. ఫలితం మమత బెనర్జీకి మామూలు విజయం దక్కలేదు. ఇప్పుడు అదే స్ట్రాటజీతో కేసీఆర్ వెళుతున్నట్లు కన్పిస్తుంది. కొన్నాళ్ల నుంచి బీజేపీ విమర్శలు చేస్తున్న కేసీఆర్ కొంత ఘాటు పెంచారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా....
ఈ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి వీల్లేదని, దిక్కుమాలిన ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని కూడా అన్నారు. ఇక మోదీ, అమిత్ షాలపై వ్యక్తిగత మాటల దాడికి దిగడం ఒక్కటే మిగిలింది. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా బీజేపీ మరింత ఎదగకుండా ఉండాలంటే ఇదే రూటులోనే వెళ్లడం మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లుంది. రాష్ట్రంలో పెద్దగా బలం లేకపోయినా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లే కన్పిస్తుంది.
రానున్న కాలంలో....
రానున్న కాలంలో కేసీఆర్ మాటల దాడి మరింత పెరిగే అవకాశముంది. రైతులు, పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని అర్థమవ్వడంతోనే వారిని ఆకట్టుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తాను బయటకు గెంటేసిన ఈటల రాజేందర్ ను వారు పార్టీలోకి తీసుకున్నారన్న కోపం కూడా ఉండి ఉండవచ్చు. అందుకే దేశంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు మూడు లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. ముందు ముందు కేసీఆర్ బీజేపీకి మరిన్ని టాస్క్ లు ఇచ్చే అవకాశముంది.


Tags:    

Similar News