అలా ఎలా పంపించేస్తాం..?

Update: 2018-08-15 11:53 GMT

ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయాలు... రాజీనామాలు ఆసక్తికరంగా మారాయి. ఇవి ట్విట్టర్ వేదికగా జరుగుతుండటం గమనార్హం. తాజాగా ఆ పార్టీ ముఖ్య నేత అశుతోష్ వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేశారు. ‘‘ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది. ఆప్ తో నా అద్భుతమైన నా ప్రయాణానికి కూడా ముగింపు ఉంది. నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామాను పార్టీ పోలిటికల్ ఆఫైర్స్ కమిటీ ఆమోదించాలి. ఇది నా వ్యక్తిగతం. ఈ ప్రయాణంలో నాకు అండగా ఉన్న పార్టీకి, అందరికీ ధన్యవాదాలు’’ అంటూ అశుతోష్ ట్వీట్ చేశారు. జర్నలిస్టుగా పనిచేసిన ఆశుతోష్ అనంతరం ఆప్ లోకి వచ్చారు. పార్టీ తరుపున డిబేట్లలో బలంగా వాదించే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందడంతో పాటు కీలక నేతగా ఎదిగారు. 2014లో చాందిని చౌక్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఇటీవల పార్టీ నుంచి రాజ్యసభకు ఆశుతోష్ కు అవకాశం ఇవ్వనందునే ఆయన అలిగినట్లు తెలుస్తోంది. ఆశుతోష్ రాజీనామాను పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించలేదు. ఆ మేరకు ఆయన ట్విట్టర్ లోనే రిప్లై ఇస్తూ... ‘‘మీ రాజీనామాను ఎలా అంగీకరిస్తామనుకున్నారు..? అది ఈ జన్మలో జరగదు..!’’ అని పేర్కొన్నారు.

 

Similar News