అమెరికా బరిలో...22 ఏళ్ల భారత కుర్రాడు

Update: 2018-06-02 09:36 GMT

శుభం గోయెల్.. భారత్ లోని ఉత్తరప్రదేశ్ మూలాలున్న 22 ఏళ్ల యువకుడు ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. కారణం.. ఆయన ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ పడుతున్నాడు. తనకు మద్దతివ్వాలంటూ ప్రచారం చేస్తున్నాడు. అమెరికాలోనే పుట్టిపెరిగిన శుభమ్ ఇటీవలే కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, ఫిల్మ్ స్టడీస్ లో డిగ్రీ పట్టా పొందాడు. అనంతరం వర్చువల్ రియాలిటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. మొదటి నుంచి సామాజిక అంశాల పట్ల స్పందించే గుణం కలిగిన శుభం సోషల్ మీడియా వేదికగా సమస్యలపై గళమెత్తేవాడు.

రాజకీయాల్లో పారదర్శకత తీసుకువస్తా...

ఈ నేపథ్యంలో ఆయన సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ గా ఎన్నిక కావాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కాలిఫోర్నియా గవర్నర్ పదవి కోసం పోటీ చేస్తున్నాడు. మొత్తం 27 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, శుభం కి ఏ పార్టీ మద్దతు లేదు. అయినా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. తన సన్నిహితులు, మద్దతుదారులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో పారదర్శకత తీసుకువస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. అయితే శుభం ప్రయత్నం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.

Similar News