2021.. ఏయే సినిమాలకు కలిసొచ్చింది ? ఏవి హిట్టు.. ఏవి ఫట్టు ?

ఇప్పుడిప్పుడే థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలై సందడి చేస్తున్నాయి. సంక్రాంతి వరకూ ఇదే హడావిడి ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ విడుదలైన సినిమమాల్లో

Update: 2021-12-28 05:12 GMT

కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ వల్ల గతేడాది (2020) సినీ పరిశ్రమకు కష్టాలు తప్పలేదు. చాలా సినిమాలు షూటింగులు పూర్తయి.. విడుదలకు రెడీ అయినప్పటికీ.. వరుస లాక్ డౌన్లు, ఆ తర్వాత థియేటర్లు తెరచుకున్నా 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండటంతో సినిమాలకు పెద్ద కష్టాలు తప్పలేదు. 2021 వచ్చేసరికి సినిమా విడుదలలు కాస్త ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టిలు జంటగా వచ్చిన ఉప్పెన సినిమా టాలీవుడ్ కు ఊపిరి పోసింది. ఉప్పెన పెద్ద హిట్ కావడంతో.. వరుసగా సినిమాలు విడుదలయ్యాయి. కానీ.. మధ్యలో మరోసారి కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో.. పలు సినిమాలు ఓటీటీ బాటపట్టాయి.

కొంతకాలానికి మళ్లీ థియేటర్లు ఓపెన్ అవ్వగా.. వారం నుంచి రెండువారాల వ్యవధిలో టాలీవుడ్ నుంచి పలు మీడియం రేంజ్ సినిమాలు విడుదలై.. హిట్ కొట్టాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలై సందడి చేస్తున్నాయి. సంక్రాంతి వరకూ ఇదే హడావిడి ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ విడుదలైన సినిమమాల్లో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సినిమాలు లేకపోలేదు. కానీ.. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోలకు 2021 కలిసొచ్చిందనే చెప్పాలి.

క్రాక్ తో రవితేజ హిట్
మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజకు 2021లో పెద్ద హిట్ పడింది. సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమాతో రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది.

వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఉప్పెన
ఫిబ్రవరిలో విడుదలైన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టిలు జంటగా వచ్చిన ఉప్పెన సినిమా సుమారు రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. బ్లాక్ బస్టర్ సినిమా ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. సినిమా బడ్జెట్ రూ.22 కోట్లే అయినప్పటికీ.. ఊహించని రీతిలో కలెక్షన్లు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఇది డెబ్యూ మూవీనే.
మూడు సినిమాలతో వచ్చిన తేజ
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి తేజ సజ్జా.. 2021లో హీరోగా పరిచయమయ్యాడు. జాంబిరెడ్డితో హిట్ కొట్టిన ఈ ఇంద్రసేనా రెడ్డి.. ఆ తర్వాత ఇష్క్ తో కాస్త నిరాశపరిచాడు. ఆ తర్వాత శివాని రాజశేఖర్ - తేజ జంటగా వచ్చిన అద్భుతం సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నా.. డిఫరెంట్ కథలను ఇష్టపడే ప్రేక్షకులను మాత్రం మెప్పించింది.

వకీల్ సాబ్ తో ట్రీట్ ఇచ్చిన పవన్
ఇక ఎంతోకాలంగా మంచి హిట్టుకోసం ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖాతాలోకి వకీల్ సాబ్ రూపంలో హిట్ పడింది. వకీల్ సాబ్ తో ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చారు పవన్. అజ్ఞాతవాసి తర్వాత వచ్చిన వకీల్ సాబ్ మంచి మాస్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది.
రెడ్ తో రామ్
చాలాకాలం తర్వాత చాక్లెట్ బాయ్ రామ్.. ఇటు మాస్ లుక్ లో.. అటు క్లాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. అదే రెడ్ సినిమా. లవ్ కమ్ క్రైమ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించుకుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో ఫస్ట్ హిట్
అక్కినేని వారసుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో ఎన్నో అంచనాలతో ముందుకొచ్చాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు 2021 హిట్ అందించింది. అంతకుముందు అఖిల్ చేసిన సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరచగా.. కాస్త కొత్తదనంతో కూడిన లవ్ స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా వచ్చి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో అఖిల్ విజయాల ఖాతాను తెరిచాడు.

బాలకృష్ణకు అఖండ విజయం
అఖండ సినిమాతో.. నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ హిట్ అందుకున్నారు. తనకు కలిసొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. రోరింగ్ హిట్ గా నిలిచింది. బాలయ్య డబుల్ఫోజ్ గా వచ్చిన అఖండలో.. సెకండాఫే సినిమాకు ప్రాణం పోసింది. అఖండగా బాలయ్య ఇచ్చిన పెర్ఫామెన్స్ మాస్ ఆడియన్స్ ను కట్టిపడేసింది.

శ్యామ్ సింగరాయ్ గా థియేటర్లోకి వచ్చిన నాని
నేచురల్ స్టార్ నాని సినిమా థియేటర్లో విడుదలై రెండేళ్లు అవుతోంది. 2020లో వి సినిమా, 2021లో టక్ జగధీష్ సినిమాలు ఓటీటీలో విడుదలవ్వగా.. శ్యామ్ సింగరాయ్ మాత్రం థియేటర్లో విడుదలైంది. సాయిపల్లవి - నాని - కృతిశెట్టిలు హీరో హీరోయిన్లుగా.. పూర్వ జన్మ - ప్రస్తుత జన్మల నేపథ్యంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే కలెక్షన్లు రాబడుతూ.. సేఫ్ జోన్ లోకి వెళ్లే ప్రయత్నంలో ఉంది శ్యామ్ సింగరాయ్.
ఇక శ్రీవిష్ణు నటించిన గాలిసంపత్, రాజరాజచోర సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. అలాగే నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు కలిసి నటించిన జాతిరత్నాలు మంచి కామెడీ ఎంటర్టైనర్ నిలిచింది.
మాస్టర్, వైల్డ్ డాగ్, శ్రీదేవి సోడా సెంటర్, సీటీమార్ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి తొలిరోజుల్లో అలరించినా.. ఆ తర్వాత పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. సందీప్ కిషన్ నటించిన గల్లీరౌడీ సినిమా ఎవరేజ్ గా నిలిచింది. ఉప్పెనతో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ కొండపొలంతో అభిమానులను నిరాశపరిచాడు. నాగశౌర్య ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. వరుడు కావలెను, లక్ష్యతో నాగశర్య మంచి విజయాలను అందుకున్నాడు.

అరణ్యగా వచ్చిన రానా జంతుప్రేమికులను మెప్పించాడు. మ్యాస్ట్రో, రంగ్ దే సినిమాలతో నితిన్ కాస్త బెటరనిపించాడు. రిపబ్లిక్ తో సాయిధరమ్ తేజ్ నిరాశ పరచగా.. సిద్ధార్థ్ - శర్వానంద్ మహాసముద్రంతో మెప్పించారు. లవ్ స్టోరీ సినిమాతో నాగచైతన్య హిట్ అందుకున్నాడు. భారీ అంచనాలతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేమికులను అలరించింది. బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా లవ్ స్టోరీ నిలిచింది.

వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు ఓటీటీ రిలీజ్ కే పరిమితమయ్యాయి. కొడుకుని కాపాడుకునే తండ్రి నారప్పగా, కుటుంబాన్ని రక్షించుకునే కుటుంబ పెద్ద రాంబాబుగా దృశ్యం 2 సినిమాల్లో వెంకటేష్ అద్భుతమైన నటనను కనబరిచాడు. 














Tags:    

Similar News