Sanath Nagar : మంత్రి తలసానికి ఆ... గండం... గట్టెక్కితే రికార్డు బ్రేక్

సనత్ నగర్ ఎన్నిక ఈసారి ఆసక్తికరంగా మారనుంది. ఇక్కడ మూడుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యేలు లేరు

Update: 2023-11-02 07:29 GMT

సనత్ నగర్ ఎన్నిక ఈసారి ఆసక్తికరంగా మారనుంది. ఇక్కడ మూడుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యేలు లేరు. అయితే ఈసారి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ రికార్డును బ్రేక్ చేయబోతున్నారా? లేదా? అన్నది తేలనుంది. ఇప్పటి వరకూ సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే అత్యధిక సార్లు విజయం సాధించాయి. బీఆర్ఎస్ ఒక్కసారి మాత్రమే విక్టరీ కొట్టింది. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ హ్యాట్రిక్ కొడతానన్న విశ్వాసంతో ఉన్నారు. కానీ నియోజకవర్గం హిస్టరీ చూస్తే మాత్రం ఎవరూ మూడుసార్లు వరసగా గెలిచింది లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


ఎవరికీ హ్యాట్రిక్ విజయం...

సనత్ నగర్ 1978లో ఏర్పడింది. ఇప్పటి వరకూ 11 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే ఎవరూ ఒక్కసారికి మించి ఇక్కడ గెలవలేదు. కానీ 1992, 1994లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి శశిధర్ రెడ్డి వరసగా రెండు సార్లు గెలిచారు. మర్రి శశిధర్ రెడ్డి మూడోసారి గెలుపును 1999లో టీడీపీ అభ్యర్థి శ్రీపతి రాజేశ్వర్ అడ్డుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అనేక సార్లు గెలిచింది. ఇక మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా ఈ నియోజకవర్గం నుంచి 1989లో విజయం సాధించారు.
తలసాని మూడోసారి...
ఇప్పుడు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వంతు వచ్చింది. 2014లో తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తలసాని సనత్ నగర్ నుంచి గెలిచి తన సత్తా చాటగలిగారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తలసాని శ్రీనివాసయాదవ్ బీఆర్ఎస్ లోకి మారారు. మంత్రి కూడా అయ్యారు. ఇక 2018 ఎన్నికల్లో కారు గుర్తుపైన పోటీ చేసిన తలసాని శ్రీనివాసయాదవ్ మరోసారి విజయం సాధించారు. మూడోసారి గెలిచేందుకు ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కూడా గెలుపు తనదేనన్న ధీమాలో తలసాని ఉన్నారు.

రంగంలోకి మర్రి?
ఇక్కడ కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది. ఈ నియోజకవర్గంలో మూడు సార్లు గెలిచిన కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ తన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కోట నీలిమ పేరును ప్రకటించింది. ఇక మొన్నటి వరకూ కాంగ్రెస్ లో ఉండి భారతీయ జనతా పార్టీలోకి మారిన మర్రి శశిధర్ రెడ్డి బరిలో ఉండనున్నారు. ఆయన పోటీలో దిగితే రసవత్తరంగా మారుతుంది. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోతుండటంతో ఓటు బ్యాంకు అంతా తనకు మరలులుతుందని కోట నీలిమ భావిస్తున్నారు. మర్రి శశిధర్ రెడ్డి కుటుంబానికి ఉన్న పేరు ఆయనను మరోసారి గెలిపిస్తుందన్న నమ్మకంతో కమలం పార్టీ శ్రేణులున్నాయి. కాంగ్రెస్, టీడీపీ ఓట్లు ఒక చోట కలిస్తే మాత్రం తలసానికి తలనొప్పి తప్పదంటున్నారు విశ్లేషకులు. మరి సనత్ నగర్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News