BJP : ప్రయోగాలతో కదన రంగంలోకి కమలం... ఫలించేనా?

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఈసారి కొన్ని ప్రయోగాలు చేసింది. జనసేనతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల కదన రంగంలోకి దూకింది.

Update: 2023-11-28 12:51 GMT

తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈసారి కొన్ని ప్రయోగాలు చేసింది. జనసేనతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల కదన రంగంలోకి దూకింది. 119 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ఐదు జాబితాల్లో ప్రకటించింది. ముఖ్యమైన స్థానాలను గుర్తించి అక్కడ పాగా వేయగలిగే అభ్యర్థులను ఈసారి ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్లమెంటు సభ్యులను కూడా బరిలోకి దించింది. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నుంచి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి సోయం బాపూరావును బోధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించింది.

కొందరికి మినహాయింపు...
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అలాగే రాజ్యసభ్యుడు కె.లక్ష్మణ్, పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ లకు ఈ ఎన్నికల పోటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. తొలిసారిగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. బీసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణపై కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు వచ్చి హామీ ఇవ్వడం పార్టీకి ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. అత్యధిక శాతం జనాభా కలిగిన వర్గాలను ఆకట్టుకునేలా కమలనాధులు హామీలు గుప్పిస్తూ ఎన్నికల్లో పార్టీకి హైప్ తెచ్చేందుకు ప్రయత్నించారు.
మ్యానిఫేస్టోతో....
నేతలు పెద్దగా ఎవరూ చేరకపోవడం కొంత మైనస్ అయినప్పటికీ ఉన్న వారిలో ఏరి కోరి అభ్యర్థులను నిర్ణయించింది. 111 నియోజకవర్గాల్లో కమలం పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా మోదీ ఇమేజ్ తో పాటు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతున్న పార్టీ ఎత్తుకున్న నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రయత్నించారు. దీంతో ప్రజలు ఆకట్టుకునేలా మ్యానిఫేస్టోను రూపొందించారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పి ఒక వర్గం ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా కమలనాధులు కసరత్తు చేశారు. అలాగే పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించి వాటి ధరలను కూడా తగ్గిస్తామని హామీ ఇవ్వడంతో పార్టీకి అదనపు లాభం చేకూరుతుందని విశ్వసిస్తున్నారు.
ప్రచారంలోనూ...
ఇక ప్రచారంలోనూ అగ్రనేతలు నలుచెరుగులా తిరిగి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధాని మోదీ ఎనిమిది సభలు, రెండు రోడ్ షోలలో పాల్గొన్నారు. సభల్లో ప్రసంగించారు. చివరిగా మూడు రోజులు ఇక్కడే ఉండి సభలు, రోడ్ షోలలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఇక్కడే తిష్టవేసి ప్రచారాన్ని నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ లో జోష్ నింపారు. అమిత్ షా 22 ర్యాలీలు, సభల్లో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ లు కూడా సభల్లో పాల్గొని ప్రజలను కాషాయం పార్టీ వైపు తిప్పలే కొంత శ్రమించారు. మరి చివరకు ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం కానీ... గతంలో కన్నా ఈసారి బీజేపీ పరిస్థితి మెరుగుపడిందనే చెప్పాలి.


Tags:    

Similar News