నోట్ల రద్దుతో మోదీకి అనూహ్య ఎదురుదెబ్బ!

Update: 2016-11-13 11:37 GMT

మీకు బాగా గుర్తున్నట్లయితే... నోట్ల రద్దు అనే కఠిన నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక విషయం చెప్పారు. ఈ తీవ్రమైన నిర్ణయాన్ని ఇలా హఠాత్తుగా తీసుకోవడం వలన దేశంలో సామాన్యులకు చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయని... పాలకేంద్రాలు, బస్సు, రైల్వే రిజర్వేషన్లు, ప్రయాణాల్లో ఉండే వారు.. ఇలాంటి వారికి ఇబ్బందులు రాకుండా.. కొన్ని మినహాయింపులను ప్రకటించారు. కానీ ఒకసారి నిషేధం అమల్లోకి రాగానే.. ప్రధాని నరేంద్ర మోదీ ఊహకు కూడా అందని స్థాయిలో అనేక కోణాల్లోంచి అనేక రకాల ఇబ్బందులు ప్రజలను చుట్టు ముట్టాయి. ప్రధానంగా చిల్లర సమస్య అనేది ఇవాళ్టి వరకు కూడా జనానికి ఊపిరాడనివ్వకుండ చేస్తోంది. ఇలా ప్రభుత్వానికి దిక్కుతెలియకుండా అనేక ప్రజా సమస్యలు వచ్చి పడ్డాయి. ఇవన్నీ అనూహ్యమైన పరిణామాలే.

అలాగే ప్రధాని మోదీకి ఇబ్బందికరంగా.. ఈ నోట్ల రద్దు వలన ఓ ప్రధానమైన రాజకీయ పరిణామం కూడా చోటు చేసుకుంటున్నది. ప్రధాని మోదీ పాలనకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీలతో దేశవ్యాప్త తృతీయ కూటమి ఏర్పడడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఒక ఆలంబన దొరికినట్లుగా ఈ నోట్ల రద్దు వ్యవహారం తయారైంది.

ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇలాంటి మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడడంలో అవసరం అయితే.. స్వరాష్ట్రంలో సాంప్రదాయంగా తన ప్రత్యర్థి అయిన వామపక్షాలతో కలిసి పోరాటం చేయడానికి కూడా సిద్ధం అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడం అనేది చాలా కీలక పరిణామంగా ఉంది. నవంబరు 16 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో.. అప్పటిదాకా దేశంలో జనం నోట్ల కష్టాలు కొలిక్కి వచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. పార్లమెంటు సమావేశాల్లో ఈ నిర్ణయం మరియు దీనివల్ల కష్టాలగురించి చాలా పెద్దస్థాయిలో పోరాడాలని మమత అనుకుంటున్నారు. ఇప్పటికే మమత వాదనకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వాదనకు పోలికలు ఉన్నాయి. వారిద్దరూ ఒకరినొకరు సమర్థించుకుంటూ మోదీ మీద మాటల దాడి చేస్తున్నారు. పనిలో పనిగా ఢిల్లీలో మాయావతి, దేశంలోని మరికొన్ని ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీలు నోట్ల రద్దు నిర్ణయం అనేది ఒక కుట్రగా అభివర్ణిస్తూ మోదీని దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఈ నోట్ల రద్దు విషయంలో వెల్లడవుతున్న ఏకాభిప్రాయం రాజకీయం ఈ పార్టీలను ఒక్కతాటిమీదకు తెచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల సమయానికి మోదీకి వ్యతిరేకంగా మరొక దేశవ్యాప్త కూటమి ఏర్పడడానికి ఈ ఐక్యపోరాటం పునాది కాగలదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మమతా బెనర్జీ ఆ కూటమి ఉద్దేశంతోనే పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. నోట్ల రద్దు వలన తన పార్టీకి ప్రభుత్వానికి రాజకీయంగా ఇలాంటి ఎదురుదెబ్బలు కూడా ఉంటాయని మోదీ ఊహించారో లేదో మరి!

Similar News