కేసీఆర్ కు ఆ ఒక్కరంటే భయమెందుకు?

Update: 2017-01-25 12:15 GMT

తెలంగాణలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ సీపీఎం. అయితే ఆ పార్టీ గులాబీ బాస్ కు తలనొప్పిగా మారింది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నూ లెక్క చేయడం లేదు. తెలుగుదేశం పార్టీని అసలు పట్టించుకోవడం లేదు. బీజేపీని సైతం లెక్క చేయడం లేదు. కాని సీపీఎం అంటే మాత్రం టీఆర్ఎస్ కంగారు పడిపోతోంది? ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే...

ఈ పార్టీతోనే తలనొప్పా..?

భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సీపీఎం. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సమైక్య నినాదం చేసిన పార్టీ. రాష్ట్రం కలిసి ఉండాలనే సీపీఎం తీర్మానించింది. అలాంటి పార్టీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తలనొప్పిగా తయారైంది. ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడుతూ నిత్యం గళమెత్తుతోంది. అసెంబ్లీలో సీపీఎంకు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అలాంటి సీపీఎం ఇప్పుడు సీఎంకు కొరకరాని కొయ్యగా తయారైంది. మల్లన్నసాగర్ నుంచి ఏ ఉద్యమాన్నైనా బలంగా తీసుకెళుతుండటంతో గులాబీనేతల్లో కంగారు మొదలైంది.

ప్రత్యేక టీం ఏర్పాటు...

సాధారణంగా కేసీఆర్ ప్రత్యర్ధులను పట్టించుకోనట్లే ఉంటారు. ఆయన చేసే విమర్శలు కూడా సూటిగా ఉంటాయి. ప్రత్యర్ధి పార్టీలను తేలిగ్గా తీసి అవతలపారేస్తారు. అలా లెక్క చేయని మనస్తత్వం ఉన్న కేసీఆర్ సీపీఎం విషయంలో మాత్రం తరచూ విమర్శలు చేస్తున్నారు. గుండుసూది పార్టీ అని మొన్న అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎంను తూర్పారపట్టారు. మల్లన్నసాగర్ లో ఫైరింగ్ జరగడానికి కారణం ఆ పార్టీ నేతలే నని దుయ్యబట్టారు. ఇక తెలంగాణలో ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేపట్టారు. కొన్ని నెలల నుంచి పాదయాత్ర తెలంగాణలో జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికే తమ్మినేని పాదయాత్ర చేపట్టారని చెబుతున్నారు. పాదయాత్ర చేస్తూనే తమ్మినేని స్థానిక సమస్యలపై రోజుకొక లేఖను సీఎం కేసీఆర్ కు రాసేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకూ తమ్మినేని 80 కి పైగానే లేఖలు రాశారు. ఇక ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాలపై ధ్వజమెత్తిన తమ్మినేని కేవలం మందబలంతోనే సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కేవలం ఆర్డినెన్స్ లను బిల్లులుగా మార్చుకునేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నారని, మంత్రులు ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడం లేదని తమ్మినేని ఆరోపించారు. ఇలా వరుసగా అధికారపార్టీపై విమర్శల దాడి చేస్తున్న సీపీఎంను కట్టడి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం మంత్రుల్లోనే ఒక టీమ్ ను రూపొందించి సీపీఎం ప్రశ్నలకు జవాబు చెప్పే బాద్యతను ఆ టీంకు అప్పగించారని సమాచారం. ఉద్యమం ఉధృతంగా జరిగే సమయంలోనూ కేసీఆర్ ఏపీ నేతలను పూచిక పుల్లతో తీసిపారేసేవారు. వారి గురించి మట్లాడితే అవతలి వారి స్థాయి పెరుగుతుందని కేసీఆర్ చెప్పేవారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నపార్టీకి ఎందుకు భయపడుతున్నట్లో....

Similar News