‘ఒకేసారి మాఫీ’ డిమాండుకు జనం మద్దతుందా?

Update: 2016-11-09 04:32 GMT

పాలకపక్షాల మీద నిత్యం ఏదో ఒక రకంగా విరుచుకు పడుతూ ఉండడమే తమ ఎజెండాగా వ్యవహరిస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని విపక్షాలు కొన్ని సందర్భాల్లో కాస్త దారి తప్పి నడుస్తున్నాయేమో అనిపిస్తోంది. పూర్తిస్థాయిలో ప్రజల మద్దతు పొందలేని అంశాలను కూడా వారు భుజానికెత్తుకుని వాటి మీద సాగించే పోరాటం నిష్ఫలం అవుతుందేమో అనిపిస్తోంది. రైతు రుణమాఫీ విషయంలో విపక్షాలు సాగించే పోరాటాలు చూసినప్పుడు ఇలాంటి అభిప్రాయమే కలుగుతోంది.

ఎన్నికల్లో ప్రజల ఓట్లను రాబట్టుకునేందుకు తురుపుముక్క అస్త్రంగానే కావొచ్చు గాక.. ప్రస్తుతం ఉన్న పాలకపక్షాలు రెండూ రైతు రుణమాఫీ అనే అంశం వాడుకుని అధికారంలోకి వచ్చాయి. రుణమాఫీ చేయడానికి కొన్ని విధివిధానాలను పెట్టుకున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ విడతలుగా మాఫీ చేస్తూ ముందుకు పోతున్నారు. రైతులు ఆ విషయంలో అంతో ఇంతో మాఫీ జరుగుతోంది కదా అనే సంతృప్తితోనే ఉన్నారు. అయితే విపక్షాలు ఒకేసారి రుణమాఫీ చేయాలనే డిమాండ్ ను ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ లో అయితే అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం ఇద్దరూ ఇదే డిమాండ్ తో ఊదరగొట్టేస్తున్నారు.

నిజానికి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు కూడా 2019 కోట్ల రూపాయలను రుణమాఫీ నిమిత్తం మూడో విడతగా విడుదల చేసింది. వచ్చే ఏడాది మరో నాలుగువేల కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. ఇది ఖచ్చితంగా రైతులకు ఎంతో కొంత ఊరట కలిగించే అంశమే. అయితే.. విడతలుగా మాఫీ జరుగుతూ ఉండగా, అది ఒకేసారి చేయాలంటూ విపక్షాలు చేసే పోరాటానికి జనం ఆదరణ ఉంటుందా అనేది అనుమానంగా ఉంది. ఆ డిమాండ్ జనానికి పెద్దగా రీచ్ కాలేదని, విపక్షాలకు పెద్దగా లబ్ధి ఏమీ లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.

ప్రభుత్వం మీద ఏదో ఒక రూపంలో బురద చల్లే ప్రయత్నాలు మాత్రమే కాదు. తాము చేసే పోరాటానికి, చేసే విమర్శలకు ప్రజల మన్నన ఉండేలా చూసుకోవడం కూడా విపక్షాల బాధ్యత. అదే లేకపోతే.. వారి పోరాటాలు వృథా కావడం మాత్రమే కాదు. వారికి ప్రజల దృష్టిలో గౌరవం పలచబడిపోతుంది.

Similar News