ఏపీ భవన్ ఎవరిది?

Update: 2017-01-13 12:37 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దేశ రాజధానిలో ఉన్న ఏపీ భవన్ ఎవరికి చెందాలన్న దానిపై ఇంకా అస్పష్టతే నెలకొంది. 9,10 షెడ్యూల్ అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో పాటు ఏపీ భవన్ పై కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల అధికారులతో జరిపిన చర్చలు కూడా ఫలప్రదం కాలేదు.

నిజాంకాలంలో....

ఢిల్లీ ఉన్న ఏపీ భవన్ తమకే చెందుతుందని తెలంగాణ వాదిస్తుంది. నిజాం కాలంలో ఈ స్థలాన్ని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. 1917, 1928, 1936 లో విడతల వారీగా 6వ నిజాం రాజు ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఈ రికార్డులను కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ముందుంచింది. భూమిని కొనుగోలు చేసిన తర్వాత నిజాం రాజు ఈ స్థలంలో భవనాన్ని నిర్మించి వసతి గృహాన్ని నిర్మించుకున్నారు. దీనికి హైదరాబాద్ హౌస్ అని కూడా పేరు పెట్టారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ హౌస్ ను తన అవసరాల కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని తీసుకుంది. దీనికి ప్రతిగా హైదరాబాద్ హౌస్ పక్కనే ఉన్న పటౌడీ హౌస్ వద్ద 7.56 ఎకరాలను, నర్సింగ్ హాస్టల్ వద్ద 2.21 ఎకరాలను కేటాయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు కూడా లేఖ రాశారు. హైదరాబాద్ హౌస్ తీసుకుని అందుకు ప్రతిగా భూమిని ఇచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనుగడలో లేదన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. దీంతో ఏపీ భవన్ తమకే చెందుతుందని తెలంగాణ సర్కారు గట్టిగా వాదిస్తోంది.

జనాభా నిష్పత్తి ప్రకారం...

అయితే ఏపీ ప్రభుత్వ వాదన మరోరకంగా ఉంది. విభజన చట్టంలో ఉమ్మడి ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రకారం పంచినప్పుడు ఏపీ భవన్ కూడా పంచాల్సిందేనని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. తమకు ఏపీ భవన్ లో వాటా దక్కాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారం 52:48 నిష్పత్తి ప్రకారం పంచాల్సిందేనని ఏపీ సర్కార్ వాదిస్తోంది. దీనిపై కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల సీఎస్ లు, ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్లతో జరపిన చర్చలు సఫలం కాలేదు. ఎవరి వాదన వారు విన్పించడంతో కేంద్ర హోంశాఖ అధికారులు కూడా ఎటూ తేల్చి చెప్పలేకపోతున్నారు. మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఇద్దరు సీఎంలు కలిసి చర్చిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించేటట్లు లేదు.

Similar News