‘ఎక్స్‌పెయిరీ డేట్’ ఉందని విపక్షాలకు తెలుసా?

Update: 2016-11-19 06:13 GMT

నోట్ల రద్దు వలన ప్రజలకు ఎదురవుతున్న కష్టాలపై తాము ఉద్యమం చేస్తామని... ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. పార్లమెంటును స్తంభింపజేస్తామని ఇలా రకరకాల ప్రకటనలతో కేంద్రంలోని విపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి. అయితే తాము చెబుతున్న ‘ఉద్యమం’ అనే పదానికి ‘ఎక్స్‌పెయిరీ డేట్’ ఉందనే సంగతి ఆ విపక్షాలు గుర్తించాయా లేదా అని విశ్లేషకులు భావిస్తున్నారు.

మోదీ, నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన నాటినుంచి దేశవ్యాప్తంగా సామాన్యులకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. ఒక్కో రకం కష్టాలు తమ దృష్టికి వస్తుండగా, వాటిని పరిష్కరించడం గురించి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ మోదీ సర్కారు ఇప్పటికే చాలా వరకు వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెస్తోంది. దేశంలో చాలా ప్రాంతాలకు ఇంకా కొత్త 500 రూపాయల నోట్లు చేరుకోకపోవడం వల్ల మాత్రమే కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. బ్యాంకుల వద్ద రద్దీ, ఏటీఎంలు పనిచేయకపోవడం వంటి సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతున్నాయి.

అయితే ‘‘జనం సమస్యలు’’ అనే ఎజెండా పెట్టుకుని విపక్షాలు పోరాటాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లయితే.. వారు ఆ పోరాటాన్ని ప్రారంభించే లోగా.. సమస్యలు మరికాస్త తగ్గిపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు. అందుకే తాము చెబుతున్న పోరాటానికి ‘ఎక్స్‌పెయిరీ డేట్’ ఉందని వారు తెలుసుకోవాలని, అది కూడా కేవలం కొన్ని రోజులు మాత్రమేనని పలువురు అంటున్నారు.

నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవడం అనే డిమాండ్ మీద ప్రతిపక్షాలు ఎంత పట్టుపట్టినా పని జరిగే అవకాశం మాత్రం లేదు. కాకపోతే ప్రజల సమస్యల గురించి ప్రస్తావించాలనుకుంటే.. ఆలోగా సమస్యలే తీరిపోయేలా వాతావరణం, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఉంటున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి పూర్తిగా సహకరిస్తూ, లోపాలను సూచించి చక్కదిద్దాలని డిమాండ్ చేస్తే సరిపోయేదానికి, పోరాటం చేస్తాం.. అంటూ రగడ చేయడం వలన నల్లధనం కట్టడి చేసే ప్రయత్నాలను అడ్డుకుంటున్న వ్యక్తులుగా జనం దృష్టిలో విపక్షాలపై ముద్ర పడినా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు.

Similar News