ఈ ఎన్నిక గురించి తెదేపా ఏం ఆలోచిస్తోందో?

Update: 2016-10-11 00:56 GMT

ప్రజల నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు చాలా కాలం ముందునుంచే సన్నద్ధం కావడం కొత్త విషయం కాదు. ఇప్పుడు అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిగా ఎవరిని మోహరించాలనే విషయంలో తెలుగుదేశ పార్టీనే ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నది. నిజానికి ఈ ఎన్నికకు సంబంధించి అటు విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ గానీ, ప్రస్తుతం సిటింగ్ ఎమ్మెల్సీగా హోదా అనుభవిస్తున్న పీడీఎఫ్ గానీ తమ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీ అయినప్పటికీ.. అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో తెదేపానే వెనుకంజలో ఉండడం విశేషం.

పట్టభద్ర స్థానిక మూడు జిల్లాలకు కలిపి జరిగే ఎన్నికలు అంటే.. మామూలు సాధారణ ఎన్నికల్లాగా పరిస్థితి ఉండదు. ఓటర్లను సాధారణ ఎన్నికల్లో లాగా ఎడాపెడా సారా పొట్లాలు, క్వార్టర్ బాటిళ్లు, డబ్బులతో కొనుక్కోవడం ఇక్కడ ప్రతిసందర్భంలోనూ సాధ్యం కాదు. ఓటర్లందరూ కనీసం డిగ్రీ చదివిన వారు. అంతో ఇంతో చదువరులు, ఆలోచనా పరుల కింద లెక్క. మంచి చెడులు ఆలోచించి ఓటు వేస్తారని అనుకోవాలి.

అలాంటి నేపథ్యంలో పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎన్నికకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది. అనంతపురం కేంద్రంగా కర్నూలు, కడప జిల్లాలు కూడా కలిసిన నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడినుంచి ఇప్పుడు పీడీఎఫ్ నాయకుడు గేయానంద్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయననే పార్టీ మరోసారి అభ్యర్థిగా ఎంపిక చేసింది. వామపక్ష నాయకుడిగా, జనచైతన్య వేదిక నాయకుడిగా , మంచి డాక్టరుగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న గేయానంద్ గత ఎన్నికల్లో సునాయాసంగా గెలిచారు. ఆలోచనాపరుడిగా, మేధావిగా ఆయనకు గుర్తింపు ఉంది. అయితే వైకాపా ఈసారి గట్టి అభ్యర్థినే మోహరించింది. గతంలో సైన్యంలో పారాట్రూపర్ గా పనిచేసి, తర్వాత ఏపీ ఎన్జీవో సంఘం నాయకుడిగా కూడా పనిచేసిన గోపాల్ రెడ్డిని తమ అభ్యర్థిని చేసింది. ఇది వారికి ఖచ్చితంగా ఎడ్వాంటేజీ అవుతుందనడంలో సందేహం లేదు.

అయితే తెదేపా ఇంకా ఏమీ తేల్చుకోలేకపోతోంది. ఫక్తు రాజకీయ నేపథ్యంతో విద్యార్హతలు, పెద్ద అర్హతలు లేకుండానే టిక్కెట్ అడిగేవాళ్లు, అది అధికార పార్టీ గనుక.. బోలెడు మంది ఉంటారు. కానీ.. వీరి పోటీని తట్టుకోవాలంటే.. తాము కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని తెదేపా భావిస్తోంది. ఏది ఏమైనా మూడు జిల్లాలు తిరిగి ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది గనుక.. పార్టీ అలవాటు ప్రకారం.. జాప్యం చేయకుండా అభ్యర్థిని వీలైనంత వెంటనే తేల్చాలని తెలుగుదేశం నాయకులు కోరుకుంటున్నారు.

Similar News