ఇప్పుడు ఆఫర్ ఇస్తే నల్లడబ్బు వెల్లువెత్తుతుంది!

Update: 2016-11-09 05:55 GMT

దేశంలో ఉన్న నల్లధనానికి అడ్డుకట్టవేస్తాం అనే అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరీ భారతీయజనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మోదీ సర్కారు క్రియాశీలంగా వ్యవహరించి.. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న బడాబాబుల నల్లధనం మొత్తాన్ని వెలికితీసి స్వదేశానికి తీసుకువస్తారని జనం ఆశించారు. ఆ దిశగా ఈ రెండున్నరేళ్లలో మోదీ సర్కారు కనీసం చిన్నపాటి ముందడుగు వేయలేకపోయింది. కాకపోతే.. శుభ పరిణామం ఏంటంటే.. స్వదేశంలోనే మూలుగుతున్న నల్లధనానికి మాత్రం చెక్ పెట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. 500, 1000 నోట్ల నిషేధం ద్వారా నల్లకుబేరుల గుండెల్లో బాంబులు పేల్చారు మోదీ.

నిజానికి స్వదేశంలో ఉన్న నల్లకుబేరులకు మోదీ సర్కారు ముందే ఒక ఆఫర్ ఇచ్చింది. 45 శాతం పన్ను కింద ప్రభుత్వానికి చెల్లించేలాగా తమ వద్ద ఉన్న నల్లధనాన్ని బయటపెట్టుకునేందుకు అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా చాలాకాలం పాటు ఈ పథకాన్ని అమలు చేశారు. దేశంలో వేర్వేరు ప్రాంతాల నుంచి చిన్న పెద్ద నల్లధనం ఉన్న సంపన్నులు స్పందించారు. ప్రభుత్వానికి చూపించిన మొత్తంలో 45 శాతం పన్ను కింద పోగా, మిగిలింది వైట్ మనీ అవుతుందన్నమాట. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఒకే వ్యక్తి పదివేల కోట్ల రూపాయల నల్లధనం ఇలా ప్రభుత్వానికి చూపించుకుని, వైట్ గా మార్చుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అంటే ఆ ఒక్క వ్యక్తి 4500 కోట్ల రూపాయలు పన్ను కింద ప్రభుత్వానికి వదిలేసుకున్నారన్నమాట. ఆ పథకం అమలు చేసినప్పుడు ప్రభుత్వానికి లెక్కచూపించుకుని, మొత్తం 65 వేల కోట్ల రూపాయల నల్లధనం వైట్ గా మారినట్లు వార్తలు వచ్చాయి. అయితే అంతకు అనేక రెట్లుగా జనం నల్లధనాన్ని దాచుకునే ఉండిపోయారు.

ఇప్పుడు నోట్ల మీద నిషేధం విధించిన నేపథ్యంలో.. ఇప్పుడు గనుక.. నల్లధనం వైట్ చేసుకునే పథకాన్ని కేంద్రం మళ్లీ ప్రకటించినట్లయితే.. ఎక్కడెక్కడ మూలుగుతున్న నల్లడబ్బు మొత్తం.. వెల్లువలా వచ్చి ప్రభుత్వ ఖజానాను చేరుకునే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్త్తున్నారు. 45 శాతం కాదు కదా.. 70 శాతం వరకు పన్ను కింద చెల్లించాల్సిందే.. 30 శాతం మాత్రం వైట్ గామారి మీ అకౌంట్స్ లోకి వస్తుంది అనే నిబంధన పెట్టినా కూడా.. లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా నల్లధనం లెక్కలు బయటకు వస్తాయనేది అంచనా. మోదీ సర్కారు ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించి.. నల్లధననాన్ని వైట్ గా మార్చుకునే అవకాశం మళ్లీ ఓసారి కల్పిస్తే.. పెనాల్టీ పెంచినా సరే.. ప్రభుత్వానికే ఎక్కువ లాభం జరుగుతుందని పలువురు అనుకుంటున్నారు.

Similar News