ఎన్ని 'కళ'ల సీజన్లో ..! పార్టీ అభ్యర్ధుల ఎంపిక.

భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక కీలక ఘట్టం. ఎన్నికలు పద్ధతి ప్రకారం, సమయానుసారం జరగడం ప్రజాస్వామ్యం ఉందనడానికి నిదర్శనంగా భావిస్తారు

Update: 2023-08-20 16:24 GMT

పార్టీ అభ్యర్ధులు ఎంపిక

భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక కీలక ఘట్టం. ఎన్నికలు పద్ధతి ప్రకారం, సమయానుసారం జరగడం ప్రజాస్వామ్యం ఉందనడానికి నిదర్శనంగా భావిస్తారు. అయితే, రాజ్యాంగంలో వాటి గురించిన ప్రస్తావన లేకున్నా, ప్రజా ప్రతినిధుల ఎన్నికలలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం అయిపొయింది. రాజకీయ పార్టీ ఏర్పడడం అంటే ఒకే రకమైన భావజాలం ఉన్న వ్యక్తుల సమూహం అని భావిస్తారు. రానురాను రాజకీయ పార్టీల మధ్య భావజాల వ్యత్యాసం తగ్గిపోయింది. భావజాల లేమి పరిస్థితులలో కూడా పార్టిలు మనగలుగుతున్నయంటే దానికి కారణం అందరికి ఒకే లక్ష్యం ఉండడం – అధికారం. ఎక్కువగా పాత పార్టీలే కనుక కొత్తగా నిర్మాణం చేసేది లేదు. కొత్త పార్టీ నిర్మాణం కూడా ఇంకా ఇంకా కష్టం అవుతున్నది. పేరుకు అనేక జాతీయ పార్టిలు ఉన్నా దేశంలో కేవలం రెండింటికే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రాంతీయ పార్టిలు, పార్టీల కూటములు కూడా ఉన్నాయి.

ఎన్నికలలో పోటికి రాజకీయ పార్టీ అభ్యర్ధులే ప్రధానం అయినారు. అంటే, ప్రజల ముందు ఆ మేరకు అభ్యర్ధులు తగ్గిపోయినారు. ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎన్నుకోవడానికి ముందే ‘పార్టిలు’ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నాయి. ప్రజల ముందుకు తోస్తున్నాయి. వినియోగదారుడికి మార్కెట్లో స్టీల్, ఇత్తడి బిందెల మధ్య పోటి లాగ ఉంటుంది. ఒక నియోజకవర్గంలో లక్ష జనాభా ఉంటె అందులో ఒక 10 మంది ఎన్నికలలో అభ్యర్ధులుగా నిలబడితే ప్రజలకు విస్త్రత అవకాశం ఉన్నట్లు. చట్ట ప్రకారం అభ్యర్ధులు ఎంత మంది అయినా ఉండవచ్చు. కాని, కొద్దీ మందే ఉంటున్నారు. ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖ పోటీలు దాటి పత్రికలు, విశ్లేషకులు కూడా ఆలోచించట్లేదు. ఒకప్పుడు నల్లగొండలో 500 మంది రైతులు నామినేషన్లు వేస్తే రాజకీయ పార్టిలు హడలిపోయాయి. ఇటీవల కాలంలో నిజామాబాదులో రైతులు నామినేషన్ వేస్తే అధికార పార్టీ అభ్యర్ధి ఓడిపోయింది. ఎక్కువ మంది వేస్తే ఓడిపోతుంది అనే భయంతో రైతులు నామినేషన్ వేయకుండా అధికారులు అనేక ప్రయత్నాలు చేసినా 100 మందికి పైగా నామినేషన్ వేయడంతో ఏమి చేయలేకపోయారు.

దీనిని బట్టి మనకు అర్థం అయ్యేది ఎన్నికలలో ఎక్కువ మంది అభ్యర్ధులు ఉండటం రాజకీయ పార్టీలకు ఇష్టం ఉండదు. వారి ప్రయోజనాలకు వ్యతిరేకం. అందుకే, ఎన్నికలలో ఎక్కువ మంది అభ్యర్ధులు ఉండకుండా చూసుకుంటారు. ఇది ఒక syndicated behaviour ద్వార సాధిస్తారు. సాధారణంగా క్రిమినల్ పనులు చేసే వారి పట్ల ఈ పదం వాడుతారు. రాజకీయ పార్టిలు, ఎవరికి వారు, అంతర్గతంగా, చేసే ఈ ప్రక్రియ ద్వార ఎన్నికలకు నిలబడే అభ్యర్ధులను నిర్ణయిస్తారు. ఒక్కోసారి రాజకీయ పార్టీల మధ్య కూడా అవగాహన ఉంటుంది. ప్రతిపక్ష పార్టిలు ఏకమయి అధికార పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తారు. ఇది ఒకప్పుడు బాగానే ఉన్నా, ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్ధి గెలిచినాక అధికార పార్టీలోకి మారడంతో, ప్రజలు మోసపోతున్నారు. అనేకసార్లు ఒక పార్టీ అభ్యర్ధి ఇంకొక అభ్యర్ధిని నిర్ణయిస్తారు. రాజకీయ పార్టీల లక్ష్యం ప్రజల ముందు ఎంపిక చేసుకునే అభ్యర్ధుల సంఖ్యను తగ్గించడమే. తద్వారా తమ అభ్యర్ధి ఎన్నికను మెరుగు చేసుకుంటారు. అభ్యర్ధులను తగ్గించడం, నిర్ణయించడం ద్వార ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చాల బాహాటంగా జరుగుతాయి. విలేకరులు అదేదో రాజకీయ ప్రక్రియ లాగా దానిని విశ్లేషణ వార్తలుగా ప్రచురిస్తుంటారు.

ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఎన్నుకోవాలంటే తమ అవసరాలకు, ఆలోచనలకూ అనుగుణంగా ప్రతినిధిని ఎంపిక చేసుకోవాలి. ఆ ఎంపిక చేసుకునే విషయంలో పరిమితులు ఉంటె ఆ మేరకు వారు ఆ స్వేచ్ఛను కోల్పోయినట్లే. పరిమిత సంఖ్యలో అభ్యర్ధులు ఉంచే ప్రయత్నాలు రాజకీయ పార్టిలు చేస్తున్నాయి. చేస్తూనే ఉన్నాయి.

అమెరికాలో అధ్యక్షులుగా ఇద్దరు మాత్రమే ఉంటారు. అయితే, ఈ ఇద్దరి ఎంపిక ఆయా పార్టీలలో ఎన్నికల ద్వార జరుగుతుంది. అంటే, దేశానికి అధ్యక్ష ఎన్నికలకు ముందు పార్టీ అభ్యర్ధుల ఎన్నిక దేశవ్యాప్తంగా జరుగుతుంది. మన దేశంలో కాంగ్రెస్స్ పార్టీలో ఈ తరహ పద్ధతి తెచ్చే ప్రయత్నం రాహుల్ గాంధీ చేశారు. సహకారం లేక వదిలిపెట్టారు. మన ఎన్నికలలో రాజకీయ పార్టిలు నిర్ణయించే అభ్యర్ధుల నుంచే తమ ప్రతినిధులను ఎంచుకునే అవకాశం ప్రజలకు ఉంది. రాజకీయ పార్టిలు ఒక ఒంటె, ఏనుగు, కుందేలు మధ్య ఎన్నికలు పెడితే ప్రజలకు వేరే దారి లేదు. ఆ మూడింటి మధ్య ఓట్లు చీలడం తప్ప ప్రజలకు వేరే మార్గం లేదు. అందుకే రాజకీయ పార్టిలు అభ్యర్ధులను నిర్ణయించే ప్రక్రియ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ఉండే విధంగా ఎలెక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాలి.

ఎన్నికలకు నిలబడే అభ్యర్ధులు చెల్లించాల్సిన డిపాజిట్లు భారీగా పెంచడం ద్వార ఎన్నికల కమిషన్ ఇతరత్రా నామినేషన్లు పడకుండా ప్రధాన రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చింది. ఒక వేళ ఎక్కువ మంది అభ్యర్ధులు ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అనుకుంటే, ఎన్నికల కమిషన్ అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా ప్రజల భాగస్వామ్యం పెంచి ఉండాల్సింది. రాజకీయ పార్టీల అభ్యర్ధులకు అంతర్గతంగా ఎన్నికలు పెట్టండి అని నిర్దేశించి ఉంటే ప్రజా ప్రయోజనాలు దక్కేవి. నామినేషన్ రుసుము పెంచితే పేదలు నిలుచునే అవకాశం తగ్గించినట్లే. ఇప్పటికే, ఎన్నికలలో ధన ప్రవాహం వల్ల స్వతంత్ర అభ్యర్ధులు పోటి చేసే వాతావరణం కలుషితం అయ్యింది.

ప్రతి రాజకీయ పార్టికి సభ్యులు ఉంటారు. కార్యకర్తలు ఉంటారు. నాయకులు ఉంటారు. పార్టీ కమిటీలలో ఈ నాయకులకు పదవులు ఉంటాయి. రాజకీయ పార్టిలు స్వచ్చంద సంస్థలే అయినా, సేవ సంస్థలు కావు. కేవలం అధికారమే లక్ష్యంగా ఏర్పాటు అయిన సంస్థలు. ఇందులో చేరేవారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు మాత్రమే చేరుతారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో కొందరే ఉంటారు. ఎవరైనా కాని, పార్టీలో కార్యక్రమాలు చేపడితే ఖర్చు అవుతుంది. సాధారణంగా పార్టిలు భరించవు. ఆయా కార్యక్రమ నిర్వాహకుల భరిస్తారు – సొంతంగా లేక చందాల వసూలు చేసి. ఒక నియోజకవర్గంలో బహిరంగ సభ జరిగితే దాని ఖర్చు అభ్యర్థిత్వం వహించే వారు భరిస్తారు. ఇది వారి పెట్టుబడి. ఇటువంటి పెట్టుబడులను, పెట్టుబడిదారులను వాడుకున్న రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో పెట్టుబడులకు తగ్గ ‘ఫలితం’ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక అలిఖిత ఒప్పందం. బహిరంగ రహస్యం. పెట్టుబడి పెట్టినవారు ఎన్నికల ద్వార ప్రజా ప్రతినిధులు అయ్యి తమ పెట్టుబడులకు తగ్గ లాభాలను ఆశిస్తారు. ఇందులో రిస్క్ ఏమిటంటే పెట్టుబడి పెట్టినంత మాత్రాన అభ్యర్థిత్వం గ్యారంటి కాదు. ఇక్కడనే అంతర్గత వ్యాపారం కనపడుతుంది. పార్టీ టికెట్లు నిర్ణయించే అధికారం కొందరికే ఉంటుంది కనుక వారికి కొంత సమర్పించ్కుకోవాలి. ఈ నిర్ణయించేవారిని అడిగితే మేము ఈ స్థానం చేరడానికి పెట్టుబడి పెట్టాము అని చెబుతారు. టికెట్లు అమ్ముకోవడం ఆరోపణలు ఈ నేపధ్యంలో నుంచే పుడతాయి. ఆరోపించే వారు సాధారణంగా అడిగినంత ఇవ్వలేక ‘ఓడిపోయినందుకు’ బయటపెడతారు. ఈ లెక్కన, ఎంత పెట్టుబడి అటు ప్రజలలో, ఇటు పార్టీలో పెట్టగలుగుతారో వారికే పార్టీ టికెట్ వస్తుంది. ప్రతి రాజకీయ పార్టీలో ఉండే వివిధ స్థాయిలలో ఆ మేరకు లావాదేవీలు ఉంటాయి. డబ్బు పాత్ర అనివార్యంగా ఉంటుంది. ఎక్కువ శాతం ‘డబ్బు’ పయనం పైకి ఉంటుంది. పై నుంచి కిందికి డబ్బు రావడం అరుదుగా, ప్రత్యెక పరిస్థితులలో మాత్రమే జరుగుతుంది.

జరుగుతున్న ఈ ప్రకియ అందరికి తెలిసిందే. అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన సంస్థలు పట్టించుకోవడం లేదు. ఈ సిండికేట్ వ్యవహారం మీద ప్రజలకు నియంత్రణ లేదు. అవగాహన చాల తక్కువ. ప్రజాస్వామ్య పరిరక్షణకు వీటిని అరికట్టే ఆలోచనలు చెయ్యాలి. ఇప్పటికే అన్ని పార్టీలలో, జాతీయ, ప్రాంతీయ పార్టీలలో, ఈ తరహ అభ్యర్ధులను నిర్ణయించడం మనం చూస్తున్నాము. ఆయా అప్రజాస్వామిక ప్రక్రియల నుంచి సంపన్నులే అభ్యర్ధులుగా మారి మన ముందుకు వస్తున్నారు. ఈ సంపన్నులకు తమ సంపద పెంపుదల మీద ఉన్న దృష్టి ప్రజల మీద ఎంత మాత్రం ఉండదు.

వ్యక్తి లేదా కుటుంబ పాలనలో ఉన్న ప్రాంతీయ పార్టిలు కూడా తమ అభ్యర్ధులను సంపన్న వర్గాల నుంచి ఎంపిక చేసుకోవడంతో ప్రజలకు దిక్కు లేని పరిస్థితి దాపురించింది. ఒక రాజకీయ పార్టీ ‘గెలుపు గుర్రంగా’ మారిన క్షణం నుంచి రాజకీయ పెట్టుబడులను ఆకర్షించడం మొదలు పెడుతుంది. పార్టీ నిధులు ప్రైవేటు ఫండ్ గా మారడం కూడా మనం చూస్తున్నాము. ఈ ‘గెలుపు గుర్రం’ పార్టిలు అభ్యర్ధుల నుంచి ‘విరాళాలు’ సేకరించి వారికి ఫలితంగా ఎన్నికల టికెట్లు ఇస్తారు. అంటే, ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే పెట్టుబడుల మీద ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఎంత అనేది అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది.

ప్రజల ముందు నిలబడే అభ్యర్ధి అప్పటికే ఖర్చు పెట్టి ఉంటారు. ఆ తరువాత ఎన్నికలలో కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే, సాధారణంగా పత్రికలలో కేవలం ప్రజలకు ఇచ్చే మందు, ఇంకా ఇతర తాయీలాల మీద చర్చ ఉంటుంది కాని, అంతకు ముందు అభ్యర్ధి పెట్టె ఖర్చు మీద ఉండదు.

ఈ ఖర్చు మీద కూడా చర్చ జరగాలి. నివారణ చర్యలు చాల అవసరం.

ప్రజలకు సేవ చేసేవారిని ప్రజా ప్రతినిధులుగా నిలబెట్టే విధంగా రాజకీయ పార్టీల అంతర్గత ప్రక్రియను కూడా నియంత్రించగలగాలి. అప్పుడే సరి అయినా అభ్యర్ధులు ఎన్నికలలో నిలబడే అవకాశాలు పెరుగుతాయి.

(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)

Tags:    

Similar News