ఫ‌ల‌క్‌నుమా దాస్‌ మూవీ రివ్యూ

బ్యానర్: వాన్మయే క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌ నటీనటులు: విశ్వక్‌సేన్‌, సలోనీ మిశ్రా, హర్షితా గౌర్‌, తరుణ్‌ భాస్కర్‌, అభినవ్‌ గోమతం సంగీతం: వివేక్‌ సాగర్‌ కథ, [more]

Update: 2019-05-31 08:08 GMT

బ్యానర్: వాన్మయే క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌
నటీనటులు: విశ్వక్‌సేన్‌, సలోనీ మిశ్రా, హర్షితా గౌర్‌, తరుణ్‌ భాస్కర్‌, అభినవ్‌ గోమతం
సంగీతం: వివేక్‌ సాగర్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్‌ సేన్‌

ఇప్పుడు తెలుగు సినిమాల్లో లోబడ్జెట్ తో తెరకెక్కుతున్న చాలా సినిమాలు యూత్ ని టార్గెట్ చేస్తూ… యూత్ కి కనెక్ట్ అయ్యేలా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక యూత్ కి ఎలాంటి సినిమాలు దగ్గరవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు బూతులు, వాస్తవికతకు దగ్గరగా, లిప్ కిస్ లు, నాలుగు రొమాంటిక్ సన్నివేశాలు, హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఇలాంటివి ఉంటే సరిపోతుంది. ఆ కోవలో వచ్చిన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో తెలిసిందే. ఇక తర్వాత వచ్చిన ఆ కోవ సినిమాలు చాలావరకు ఫ్లాప్ కూడా అయ్యాయి. తాజాగా విశ్వక్‌సేన్‌ హీరో, దర్శకుడిగా ఫ‌ల‌క్‌నుమా దాస్‌ అనే సినిమా తెరకెక్కింది. ఫ‌ల‌క్‌నుమా దాస్‌ ట్రైలర్ చూస్తే ఇది మరో అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలా ఉందే అనిపించింది. మరి అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 లాంటి హిట్ ఫ‌ల‌క్‌నుమా దాస్‌ అందుకుందా? లేదా? అనేది సమీక్షలో చూద్దాం.

కథ
ఫలక్ నుమా ఏరియాలో పుట్టి పెరిగిన దాస్ (విశ్వక్‌ సేన్‌) అదే ఏరియాలోని శంకరన్న అనే వ్యక్తిని చూసి.. ప్రేరణ పొంది చిన్నప్పడే అతనిలా ఓ గ్యాంగ్ ని పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అలా ఒక గ్యాంగ్ తయారుచేసుకుని చిన్న చిన్న గొడవలతో అలాగే టినాతో ఆ తరువాత సఖితో ప్రేమలో మునిగి తెలుతుండగా.. సడెన్ గా శంకరన్నని చంపేస్తారు. దీంతో దాస్ ఆ చంపిన వాళ్లను పట్టుకుని పొలీసులకు పట్టిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం దాస్ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలో దాస్ ఆ కేసు నుండి బయట పడ్డాడా? దాస్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? చివరికి దాస్ గ్యాంగ్ సెటిల్ అయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు
విశ్వక్ సేన్ ఒరిజినల్ గా ఎలా ఉంటాడో.. సినిమాలోనూ అలానే కనిపించదు. అంటే వాస్తవికతకు దగ్గరగా అన్నమాట. సినిమాలో న‌టుడిగా చాలా బాగా మెప్పించాడు. విశ్వక్ సేన్ బాడీ లాంగ్వేజ్‌, ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించాడు. తన నటనతో పాటు డైలాగ్ మాడ్యులేషన్ తో కూడా విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకుంటాడు. అయితే హీరోయిన్స్ ముగ్గురున్నా ఏ ఒక్కరినీ గుర్తు పెట్టుకోలేం. స్నేహితుల బృందం, రౌడీ గ్యాంగ్ ఇలా ఎవ‌రి గురించి చెప్పుకొన్నా పాత్రానుసారం న‌టించారు. కాక‌పోతే లెక్కకు మించిన పాత్రలుంటాయి. అవ‌న్నీ రిజిస్టర్‌ కావ‌డం క‌ష్టం. చాలా రోజుల త‌ర‌వాత ఉత్తేజ్‌కి మంచి పాత్ర ప‌డింది. దర్శకుడు త‌రుణ్ భాస్కర్‌ నట‌న ఓ స్పెష‌ల్ ప్యాకేజీ లాంటిది.

విశ్లేషణ
ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలో వన్ అఫ్ ద హీరోగా న‌టించిన విశ్వక్ సేన్ ఈసారి మెగా ఫోన్ పట్టారు. అయితే ఈ సినిమాలో హీరోగా నటించి తానే దర్శకత్వం వహించారు. మలయాళ సినిమా అంగమలి డైరీస్ కు ఇది రీమేక్. దానిలో కొద్దిపాటి మార్పులు చేసి, హైదరాబాద్‌ పాతబస్తీ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్లతో ఆసక్తిని పెంచేశారు. అయితే, వాటిలో చూపించినంత గొప్పగా ఏమీ సినిమా లేదు. నటుడిగా ఆకట్టుకున్న విశ్వక్‌ సేన్.. దర్శకుడిగా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. సినిమాలో మాస్ అంశాలు, మితిమీరిన డైలాగులపై పెట్టిన దృష్టి కథ, కథనాలపై పెట్టుంటే బాగుండేది. ఇలాంటి కథకు కథనం చాలా ముఖ్యం. తొలి స‌న్నివేశం నుంచే కెమెరా ఫ‌ల‌క్‌నుమా గల్లీల్లో తిరుగుతుంటుంది. అక్కడి జీవిన విధానం, మాట తీరు, దందాలు న‌డిచే ప‌ద్ధతి, కుర్రాళ్ల అల‌వాట్లూ వీటిపై ఫోక‌స్ చేసుకుంటూ వెళ్లారు. ఫ‌ల‌క్‌నుమా దాస్ లో పెద్దగా క‌థ ఉండ‌దు. ఇది చాలా చిన్న కథ. ప్రతీ స‌న్నివేశంలోనూ మందు, మ‌ట‌న్ క‌నిపిస్తుంటాయి. మాస్ గోల ఎక్కువ‌. అయినా స‌రే.. ఫస్ట్ హాఫ్ ఓకే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం గాడి త‌ప్పింది. సెకండాఫ్‌లో కథనం చాలా నెమ్మదించింది. సీరియల్ మాదిరిగా సినిమాని సాగదీశారు. దీనికి తోడు డైలాగుల్లో బూతులు ఎక్కవయ్యాయి. యువతకు, మాస్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ డైలాగులు, సీన్లు నచ్చుతాయోమో గానీ.. క్లాస్, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ జీర్ణించుకోవడం కష్టమే. సన్నివేశాల్లో ఎమోషన్స్ కూడా క్యారీ కాకపోవడం పెద్ద మైనస్. ఫ‌స్టాఫ్‌లో ల‌వ్ ట్రాక్, కాలేజ్ ఎపిసోడ్స్, యాక్షన్ సీన్లతో ఫర్వాలేదనిపించినా.. సెకండాఫ్ బాగా విసిగిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా పెద్దగా కిక్ ఇవ్వదు.

ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్, వాస్తవికతకు దగ్గరగా ఉండడం, నటీనటుల నటన

మైనస్ పాయింట్స్: కథనం, సెకను హాఫ్, బూతులు, నిడివి

రేటింగ్: 1.75/5

Tags:    

Similar News