హీరోయిన్ కాస్ట్యూమ్స్ పై వివరణ ఇచ్చిన దర్శకుడు

Update: 2017-03-31 07:12 GMT

గత వారం విడుదలైన కాటమరాయుడు చిత్రం ఇప్పటికే పరాజయం దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అధిక మొత్తాలకు పంపిణీదారులకి సినిమా థియేట్రికల్ హక్కులను విక్రయించిన నిర్మాత శరత్ మరార్ కూడా ఎంతో కొంత నష్టపోయే పరిస్థితే కనిపిస్తుంది. ఇక సినిమా ఫలితం ఎటూ తేలిపోయింది కాబట్టి చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ పార్ధసాని(డాలి) ఇప్పటి వరకు వచ్చిన విమర్శలపై తన వివరణ ఇవ్వటం ప్రారంభించాడు. కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన విమర్శలలో ప్రధానంగా కథానాయిక శృతి హాసన్ ధరించిన దుస్తుల పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటలలో రొమాన్స్ చేసే కథానాయిక స్టైలింగ్ ఏ రీతిలో వుండాలని అభిమానులు ఊహించుకుంటారో అందుకు భిన్నంగా శృతి హాసన్ అవతారం ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి.

శృతి హాసన్ కి అటువంటి కాస్ట్యూమ్స్ వాడటానికి తలెత్తిన పరిస్థితులని వివరిస్తూ, దర్శకుడు డాలి "మేము హీరోయిన్ కాస్ట్యూమ్స్ కోసం బొంబాయి కి చెందిన కాస్ట్యూమ్ డెసైనెర్స్ ని నియమించుకుని వారికి కాస్ట్యూమ్స్ ఏర్పాటు చేయటానికి అమౌంట్ ఇచ్చేసి మేము లొకేషన్ కి వెళ్లిపోయాం. వారు శృతి హాసన్ కి ఆ విధమైన కాస్ట్యూమ్స్ చేస్తారని అసలు ఊహించలేదు. ఆ పాటలు చిత్రీకరించిన లొకేషన్స్ విదేశాలలో కావటం మూలాన మేము ఆ కాస్ట్యూమ్స్ మార్చి వేరేవి ఏర్పాటు చేసుకోలేకపోయాం. కాల పరిమితి మరో సమస్య కావటంతో అప్పటికి తప్పనిసరిగా సాంగ్ షెడ్యూల్ పూర్తి చెయ్యవలసి ఉండటంతో మాకు ముందుగానే కాస్ట్యూమ్స్ సెట్ అవ్వలేదని తెలిసినప్పటికీ మేము చిత్రీకరణ జరిపేసాము. ముందుగా మేము కాస్ట్యూమ్ డెసైనెర్స్ చేసిన కాస్ట్యూమ్స్ ని చెక్ చేసుకోకపోవడం వల్లన ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాం." అంటూ తన బాధ వ్యక్త పరిచాడు డాలి.

Similar News