సైకిల్ చైన్ తో కాదు.. రుద్రాక్షతో దిగాడు!

Update: 2017-08-29 10:00 GMT

నాగార్జున తాజా చిత్రం 'రాజుగారి గది 2'ని ఓం కార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. 'రాజుగారి గది'కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'రాజుగారి గది 2 ' లో నాగ్ కు కాబోయే కోడలు సమంత కూడా కీ రోల్ లో గెస్ట్ గా నటిస్తుంది. ఇక నాగార్జున ఈ చిత్రంలో సైక్రటిస్ట్ కేరక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే 'రాజుగారి గది 2 ' అక్టోబర్ లో విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్ర పబ్లిసిటీ మీద చిత్ర యూనిట్ దృష్టిపెట్టడమేకాకుండా వినాయక చవితి రోజున టైటిల్ లోగోని విడుదల చేసింది. అలాగే నాగార్జున బర్త్ డే సందర్భంగా 'రాజుగారి గది 2 ' మోషన్ పోస్టర్ ని ఈ రోజు మంగళవారం విడుదల చేసింది.

ఈ రాజుగారి గది మోషన్ పోస్టర్ లో నాగార్జున రుద్రాక్ష మాలతో భలే కనిపిస్తున్నాడు. అసలు మానసిక వైద్యుడు పాత్ర చేస్తున్న నాగ్ దెయ్యాలను తరిమికొట్టడానికి దేవుణ్ణి నమ్ముకుని రుద్రాక్షతో కనబడుతున్నాడా? అనే అనుమానం వచ్చేస్తుంది.... ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే. నాగార్జున రౌద్రంగా రుద్రాక్ష మాలతో కనబడుతున్నాడు. అలాగే మోషన్ పోస్టర్ 'రుద్రం అభయ ముద్రం.. ప్రణయ విలయ రుద్రం... గగన రౌద్రం... ప్రణయ వలయ రుద్రం.. అభయముద్రం... జనన నయన ముద్రం.. గగన రౌద్రం...' అంటూ వస్తున్న బ్యాగ్రౌండ్ పాటలో నాగార్జున లుక్ ని రివీల్ చెయ్యడం కొత్తగా అనిపిస్తుంది.

ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి అదిరిపోయే లెవల్లో మ్యూజిక్ అందించాడనే విషయం ఈ 'రాజుగారి గది 2 ' బ్యాగ్రౌండ్ స్కోర్ లో తెలుస్తుంది. ఇకపోతే మరి 'శివ' చిత్రంలో స్టూడెంట్ గా సైకిల్ చైన్ తో దడ దడలాడించిన నాగ్ ఇప్పుడు మానసిక వైద్యుడిగా ఇలా చేతిలో రుద్రాక్షతో కనబడుతున్నాడు. అప్పుడు సైకిల్ చైన్ ఇప్పుడు రుద్రాక్షని చూస్తుంటే నాగార్జున కేరెక్టర్ ఈ 'రాజుగారి గది'లో కొంచెం ఇంట్రెస్ట్ కలిగించేలానే ఉంది.

Similar News