సినిమాలపై ఎటువంటి అభిప్రాయం లేకుండానే పవర్ స్టార్ అయ్యాడట

Update: 2017-02-13 06:13 GMT

తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకి వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. జయాపజయాలకు సంబంధం లేకుండా పవర్ స్టార్ అభిమానులు ఆయన సినిమాలను పదే పదే చూస్తుంటారు. వరుస వైఫల్యాలతో వున్నా ఆయన మార్కెట్ ని కాపాడేది రిపీటెడ్ ఆడియన్స్ గా చెప్పుకునే అభిమానులే. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజన్స్ పై వారికుండే మమకారం అటువంటిది. అలాంటి వీరాభిమానులని లక్షల సంఖ్యలో కలిగిన పవన్ కళ్యాణ్ మాత్రం తనకి సినిమా అనేదానిపై ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏది లేదని చెప్పటం గమనార్హం. సినిమా హీరో అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని పలు సినిమా వేడుకల్లో చెప్పిన పవన్ కళ్యాణ్ తాజాగా అమెరికాలో హార్వార్డ్ యూనివర్సిటీ లో చేసిన ప్రసంగంలో మాత్రం కొత్త విషయాలు చెప్పారు.

"నేను ఏడు అంటే ఏడే సినిమాలు చేద్దామని అనుకున్నాను. ఆ అనుకున్న సినిమాలు పూర్తి చేసిన అనంతరం జానీ సినిమా ఫెయిల్యూర్ తో ఆ సినిమా నష్టాల నుంచి బైట పడటానికి చాలా సినిమాలు చేయవలసి వచ్చింది. ఇక అప్పటి నుంచి డెడ్ లైన్స్ అంటూ సినిమా రంగానికి ఏమి విధించుకోలేదు. ఇప్పటికి కూడా సినిమా పై నాకు ఇష్టం కానీ అయిష్టత కానీ ఏమి లేవు. నేను డబ్బులు కోసం సినిమాలు చేస్తే సినిమాలు నాకు డబ్బుతో పాటు ఎందరో అభిమానులని సంపాదించి పెట్టింది. అందుకే వారి కోసమైనా సినిమాలు చేస్తూనే ఉంటా. అయితే సిన్మాలకతీతంగా చేయదలచినవి ఎన్నో వున్నాయి. వాటిపై కూడా దృష్టి సారిస్తూ సినిమా జీవితాన్ని కొనసాగిస్తాను." అని చెప్పి తన ప్రసంగానికి ముగింపు పలికేటప్పుడు అమెరికా దేశంలో కూడా జైహింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించటమే కాకుండా ఆడిటోరియం లోని జనంతో కూడా జైహింద్ అనే నినాదాన్ని చూపించారు పవన్ కళ్యాణ్.

Similar News