సర్కార్ 3 కోసం ‘గణేశ్ ఆరతి’ పాడిన బిగ్ బీ

Update: 2016-11-09 08:14 GMT

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో సర్కార్ 3 ప్రస్తుతం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎంతో పేషన్ తో సర్కార్ సిరీస్ లోని తొలి రెండు చిత్రాలను రూపొందించిన మేకర్ రాంగోపాల్ వర్మ.. మూడో భాగం చిత్రాన్ని కూడా అంతే శ్రద్ధతో తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఈ చిత్రం కోసం గణేశ్ ఆరతి పాటను అమితాబ్ బచ్చన్ స్వయంగా పాడి రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. గణేశ్ ఆరతి గీతాన్ని నేను పాడాను అంటూ అమితాబ్ స్వయంగా ట్వీట్ చేశారు.

చిత్రంలో జుహు బీచ్ లో గణేశ్ ఉత్సవాల సందర్భంగా గణేశ్ ఆరతి ఇస్తూ అమితాబ్ ఆ గీతాన్ని పాడే సన్నివేశం కూడా ఉంటుంది. ఆ సన్నివేశాన్ని ఇటీవలే జుహు బీచ్ లో చిత్రీకరించారు.

రాంగోపాల్ వర్మ.. తన జీవితంలో ఎంతో ఇష్టమైన గాడ్ పాదర్ చిత్రం స్ఫూర్తితో భారతీయ మాఫియా, రాజకీయాల నేపథ్యాన్ని స్పృశిస్తూ చేసిన సర్కార్ చిత్రం 2005లో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2008లో దానికి సీక్వెల్ గా సర్కార్ రాజ్ వచ్చింది. ఆ సిరీస్ లో వర్మ చాలా గ్యాప్ తీసుకున్నారనే చెప్పాలి. ఇప్పుడు మూడోభాగం తయారవుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ తో పాటు రోహిణి హట్టంగడి, జాకీష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్, రోనిత్ రాయ్, భరత్ దబోల్కర్, యామీ గౌతమ్ తదితరులు నటిస్తున్నారు.

Similar News