సరైన హీరోతోనే నీతిని చెప్పించారు!

Update: 2016-11-29 14:08 GMT

అతివేగం అనర్థ దాయకం.. నీతి ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉంటారు. కానీ ఒకసారి వాహనం మీదికి ఎక్కిన తరువాత.. రోడ్డు విశాలంగా, రద్దీ లేకుండా ఊరిస్తున్నప్పుడు యాక్సిలేటర్ ఆటోమేటిగ్గా తారస్థాయికి చేరిపోతూ ఉంటుంది. కేవలం అతివేగం కారణంగానే చాలా ఘోరమైన ప్రమాదాలు అనేకం జరుగుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రంలోనే అనేక మంది ప్రముఖులు తమ పిల్లలను ఈ వాహనాల అతి వేగం దెబ్బకు కోల్పోయిన దుర్ఘటనలు మనకు తెలుసు. ఇలాంటి నేపథ్యంలో శ్రీహర్ష ఫౌండేషన్ వారు ఓ కార్యక్రమం నిర్వహించారు. అతివేగం అనర్థదాయకం అనే నీతిని సెలబ్రిటీ ద్వారా ప్రచారం చేయించాలనుకున్నారు. దీనికి అక్కినేని నాగచైతన్య మద్దతు ఇస్తూ.. స్వయంగా తానే కార్యక్రమంలో పాల్గొని ఈ పబ్లిక్ మెసేజిని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించడం, హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత గురించి చెప్పడం విశేషం.

అయితే సినీ ఇండస్ట్రీలో మాత్రం చైతూ.. వేగం గురించి హితబోధ చేయడం జనం సరదాగా కామెంట్లు చేసుకుంటున్నారు. నాగచైతన స్పీడ్ డ్రైవింగ్ కు పెట్టింది పేరు. రేసుల్లో పాల్గొనే అలవాటు ఉన్న తెలుగు హీరో చైతూ ఒక్కరే. ఫార్ములా వన్ కాదు గానీ.. ఆ స్థాయిలో ఉండే కారు రేసుల్లో పాల్గొనడంలోనూ మన హీరో దిట్ట. చైతూకు రేసర్ గా చాలా పెద్ద పేరుంది.

అలాంటిది రేసర్ అయిన హీరోతోనే.. వేగం గురించి హితోపదేశం చేయించడం.. చాలా సబబుగా ఉందని.. జాగ్రత్తల గురించి యువతరాన్ని హెచ్చరించినట్లుగా ఉన్నదని పలువురు అనుకుంటున్నారు.

Similar News