శర్వానంద్ రియాక్ట్ కాలేదు కానీ నాని స్పందించాడు

Update: 2017-03-30 13:07 GMT

ఎవడే సుబ్రహ్మణ్యం తో మొదలుకొని నేటి వరకు వరుసగా ఆరు సినిమాలతో మినిమమ్ గ్యారంటీ హీరోగా ఆవిర్భవించాడు నాని. భలే భలే మగాడివోయి, జెంటిల్ మాన్, నేను లోకల్ చిత్రాలతో ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా పెద్ద స్టార్ హీరోస్ తో కలెక్షన్స్ కి పోటీ పడ్డాడు . వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో స్వప్న సినిమా వారు నాని కి ఇచ్చిన సదావకాశం ఎవడే సుబ్రహ్మణ్యం. సినిమా పరిశ్రమకి చెందిన ప్రముఖులంతా ఈ చిత్రం నిర్మించినందుకు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ లని, చేసినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో నాని లకు విమర్శకుల నుంచి కూడా అభినందనల వర్షం కురిసింది. ఆ చిత్రం తరువాత అతిధి పాత్రలతో కలిపి నాని ఇప్పటికి అరడజను చిత్రాలు పూర్తి చేసాడు కానీ ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ఇంకా తన తదుపరి చిత్రం సెట్స్ పైకి తీసుకు వెళ్ళలేదు.

ఎవడే ఆబ్రమణ్యం పూర్తి ఐన నాటి నుంచి తన దృష్టి మొత్తాన్ని మహానటి సావిత్రి గారి జీవిత కథని తెరకెక్కించటానికి కేంద్రీకరించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంత కాలం కష్టపడి స్క్రిప్ట్ పనులు ముగించి ఇప్పుడు కాస్టింగ్ పనులలో నిమగ్నమై వున్నాడు. మహానటి సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ ని ఖరారు చేసిన దర్శక నిర్మాతలు మేల్ ఆర్టిస్ట్స్ ఎంపికకై తలమునకలై వున్నారు. కాగా నాగ్ అశ్విన్ తొలి చిత్రంలో హీరోగా చేసిన నాని తోపాటు మరో యువ కథానాయకుడు శర్వానంద్ మహానటి చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే హీరో నాని ఈ వార్తలని ఖండిస్తూ తాను మహానటి లో ఎలాంటి పాత్ర కోసం ఇప్పటికి వరకు సంప్రదించబడలేదని తెలియజేశాడు. ప్రస్తుతానికి నిన్ను కోరి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా గడుపుతున్నట్టు తెలిపాడు నాని.

నాని నటించటం లేదు అనేది తేలిపోయింది కాబట్టి మరి శర్వానంద్ పేరు కూడా పుకార్లలో భాగంగానే వినపడిందా లేక నిజంగానే నాగ్ అశ్విన్ అతనిని సంప్రదించాడా అనేది ఇంకా తెలియ రాలేదు. ఇప్పటి వరకు అయితే శర్వానంద్ మహానటి లో పాత్రపై ధృవీకరించటం కానీ ఖండించటం కానీ చెయ్యలేదు.

Similar News