వేదికపై పాట పాడి రంజింపజేసిన వర్మ

Update: 2016-12-03 17:44 GMT

సాధారణంగా గాయకులుగా ముద్ర ఉన్న వారు కూడా బహిరంగ వేదికలమీద సంగీతం లేకుండా పాడడం అంటే కాస్త జంకుతారు. రికార్డింగ్ స్టుడియోల్లో ఎంతగా అనుభవం ఉన్నవారైనా సరే.. సభావేదికల మీద పాడడానికి సమానంగా ఉత్సాహపడే వాళ్లు తక్కువే ఉంటారు. అయితే రాంగోపాల్ వర్మ స్టయిలే వేరు. ఆయన పాడదలచుకుంటే.. ఆయనకు జంకూ గొంకూలాంటివి ఏమీ ఉండవు. అందుకే ఆయన రాంగోపాల్ వర్మ అయ్యారు.

ఇంతకూ విషయం ఏంటంటే.. వర్మకు తెర మీద తానూ ఒక పాత్రగా కనిపించడం తప్ప.. తతిమ్మా అన్ని రకాల ఆసక్తులు ఉన్నట్లు గతంలోనే నిరూపించుకున్నారు. రక్త చరిత్ర సినిమాకు ఇండ్రటక్షన్ చెప్పడానికి ... తనే వాయిస్ ఓవర్ కు పూనుకున్నారు. తర్వాత ఆ చిత్రంలోనూ ఓ పాట పాడి.. గళమాధుర్యాన్ని ప్రజలకు రుచిచూపించారు. అలాగే ప్రస్తుతం ఆడియో విడుదల అయిన వంగవీటి చిత్రంలో కూడా ఓ పాట పాడారు వర్మ. ఆడియో విడుదల సందర్భంగా ఆయన ఆ పాటను వేదిక మీద కూడా పాడి సభికులను అలరించారు.

‘‘వంగవీటి.. వంగవీటి.. వంగవీటి... నీది వంగవీటి కత్తి.. కాపుల్ని కాసే శక్తి.. కమ్మని పౌరుష సూక్తి.. వడ్డిస్తుంది భయమూ భక్తి.. తట్టిలేపింది కసి.. రౌడీయిజానికి ప్రాణం పోసి.. కాలం రాసిన చరిత్రలో.. కాలం తీరని కథ ఇదిరా..’’

అంటూ పల్లవిని పాడి అలరింపజేశారు. ఇది కాలం తీరని కథ గనుకనే తాను దీనిని సినిమాగా తీయాలని డైరక్టర్ కాక ముందునుంచి కలగంటున్నట్లు వర్మ చెప్పుకున్నారు.

అయితే వర్మ పాటపాడడం ప్రారంభించగానే సభికుల్లోని విద్యార్థులంతా పెద్దపెట్టున కేకలు పెట్టారు. అయితే వారు కేరింతలు కొట్టారా? లేదా, హాహాకారాలు చేశారా చెప్పడం కష్టం.

Similar News