విశ్వనాథ్ గారిని మెప్పించిన వినాయక్

Update: 2017-02-07 16:48 GMT

సిరి సిరి మువ్వా, సీతామాలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతి ముత్యం, సిరి వెన్నెల, శృతి లయలు, స్వయం కృషి, స్వర్ణ కమలం, సూత్రధారులు, ఆపత్బాంధవుడు, స్వాతి కిరణం, శుభ సంకల్పం. ఈ లిస్ట్ అంతా ఏంటి అనుకుంటున్నారా? తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎన్నటికీ మరచిపోలేని ఆణిముత్యాలు. ఈ చిత్రాలన్నిటి వెనుక వున్న వ్యక్తి ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు. ఒకటి లేదా రెండు ఆణిముత్యాలు జీవితకాలంలో చేయటానికి ఇతర దర్శకులు ఆపసోపాలు పడుతున్న పరిశ్రమలో ఆయన వాణిజ్య అంశాలపై దృష్టి సారించకుండా ఫైన్ ఆర్ట్స్ ని కథాంశాలుగా తీసుకుని ఇన్ని ఆణిముత్యాలు అందచేశారు. ఆయన దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి స్వయం కృషి, ఆపత్బాంధవుడు చిత్రాలు చేశారు. చిరంజీవి తన కం బ్యాక్ చిత్రాన్ని కళాతపస్వికి చూపించటానికి ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఖైదీ నెం. 150 చిత్రాన్ని మెగా స్టార్ మరియు చిత్ర దర్శకుడు వినాయక్ తో కలిసి వీక్షించిన విశ్వనాధ్ ఖైదీ నెం. 150 పై ప్రశంసల జల్లు కురిపించారు.

"ఇన్ని సంవత్సరాల విరామం తరువాత తిరిగి నటిస్తున్నప్పుడు ఎవరికైనా పూర్వం వున్న చార్మ్ తగ్గుతుంది. కానీ చిరంజీవిలో ఆ మార్పు కనిపించలేదు. అప్పట్లో ఎంత గ్రేస్ తో అతని ఎక్స్ప్రెషన్స్ మరియు మూవ్మెంట్స్ ఉండేవో ఇప్పుడు కూడా అలానే కనిపించాడు. ఈ వయసులో ఇంతటి గ్రేస్ తో నటించటం ఒక్క చిరంజీవికే దక్కిందేమో. చిరంజీవి వంటి నటుడు పరిశ్రమకి దొరకటం మరొక సారి జరగదు. ఖైదీ నెం.150 లానే చిరంజీవి తదుపరి చిత్రాలు కూడా సక్సెస్ కావలి. చిరంజీవి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. ఖైదీ నెం. 150 లో వున్న రైతు కష్టాలని తెరపై చూపించటానికి వినాయక్ పాటించిన కమర్షియల్ ట్రీట్మెంట్ చాలా గొప్పగా వుంది. ప్రేక్షకుడు కేవలం సందేశం కోసం థియేటర్లకు వస్తున్నట్టు ఫీల్ అవకుండా చిరంజీవి నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ జోడించి ఖైదీ నెం.150 తో గొప్ప సందేశాన్ని కూడా ఇవ్వగలిగాడు వినాయక్." అని చిరు మరియు వినాయక్ ల పని తీరుపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు కళాతపస్వి.

Similar News