విరామం తీసుకుందామనుకుని విమర్శల పాలయ్యాడు పాపం

Update: 2017-03-31 14:48 GMT

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ల చిత్రాలకు మినహాయిస్తే బయట వారి సినిమాలకు సంగీతం సమకూర్చటం చాలా కాలం కిందటే తగ్గించేశారు సంగీత దర్శకులు కీరవాణి. అడపా దడపా ఆయన ఇతర దర్శకుల చిత్రాలకు స్వరాలూ కట్టారు తప్పితే రాఘవేంద్ర రావు, రాజమౌళి లాచిత్రాలతోనే ఆయన కాలం గడుపుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా బాహుబలి ది కంక్లూషన్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకి ముందు తాను రిటైర్ కాబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపిన కీరవాణి తరువాత చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పాపం.

తెలివి తక్కువ, మూర్ఖులైన దర్శకులతో పని చేయటానికి మనస్కరించటం లేదని, అదే పనిగా సాహిత్య రచయితల గురించి ప్రస్తావిస్తూ వేటూరి-సిరివెన్నెల తరువాత సాహిత్యం అంపశయ్య మీదకి జారుకుంది అంటూ నేటి తరం సాహిత్యకారులని కించపరిచే విధంగా వ్యాఖ్యానించారు కీరవాణి. దీనితో ట్విట్టర్ లో కీరవాణి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు రిటైర్మెంట్ ప్రకటించి ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసిన మీరు, మీ రిటైర్మెంట్ వల్ల ఎవరికైనా నష్టం ఉందా అని ఆలోచించుకున్నారా? అంటూ ట్వీట్ల ద్వారా కీరవాణి పై విమర్శలు కురిపించారు. మీ స్వరాలూ వినిపించనంత మాత్రాన చిత్ర సీమ లో ఊహించని మార్పులు, దయనీయమైన పరిస్థితులు చోటు చేసుకోవు అంటూ నెటిజన్లు హితవు పలికారు. సాహిత్య రచయితల మేధా శక్తిని, దర్శకుల క్రియాశీలతని ప్రశ్నించిన మీరు మీ స్వరాలు ఇతర భాషల స్వరాల నుంచి కాపీ అని రుజువులతో కూడుకున్న ఆరోపణలకు మీరు ఏమి సమాధానం ఇస్తారు అంటూ కీరవాణి పై మండిపడుతున్నారు.

అసలు కీరవాణి కి ఇంతటి వ్యతిరేకత వస్తుందని ఎవరూ ఊహించి వుండరు. అయితే నెటిజన్లు వేసిన ఒక్క ప్రశ్నకి కూడా కీరవాణి దగ్గర సమాధానం వుంది ఉండకపోవచ్చు. రాఘవేంద్ర రావు ఇప్పటికే సినిమాల సంఖ్య బాగా తగ్గించుకున్నారు. ఆయన అడపా దడపా కష్టపడి చేస్తున్నవి కూడా మిశ్రమ ఫలితాలు అందుకుంటున్నాయి. ఇక రాజమౌళి స్థాయి ఇప్పుడు అంతర్జాతీయ పరిమాణాలతో కూడుకున్నది. ఆయనకి భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు వున్న సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులతో పని పడుతుంది. మరి ఈ ఇద్దరికీ మాత్రమే స్వరాలూ అందిస్తున్న కీరవాణి రిటైర్మెంట్ వల్ల ఎవరికీ నష్టం ఉండబోదు అనేది ఆయన గ్రహించి సాహిత్య రచయితలపై ఆయన చేసిన కఠిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే మంచిది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Similar News