వారు విడిపోవడానికి నాకు ఏమిటి సంబంధం?

Update: 2016-12-28 03:03 GMT

2016 లో సౌత్ చిత్రాలలో శృతి హాసన్ నటించిన చిత్రం ఒకే ఒక్కటి. విజయ దశమికి మలయాళ చిత్ర రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన ప్రేమమ్ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య సరసన నటించిన ముగ్గురు భామలతో ఒకరిగా శృతి హాసన్ కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ చిత్రం మంచి స్పందనతో పాటు గొప్ప రేటింగ్స్ పొందినప్పటికీ మాతృక మలయాళ ప్రేమమ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులలోనూ ఎక్కువ శాతం మంది వీక్షించేయటం తో తెలుగు ప్రేమమ్ ఆశించిన స్థాయి ఫలితాలు చూపలేకపోయినప్పటికీ పంపిణీదారులు నష్టాల పాలావని విధంగా ఆడింది. ఇక 2016 కు తమిళ నటుడు సూర్య కు బాగా కలిసొచ్చిన సింగం సిరీస్ లో మూడవ భాగం ఐన ఎస్ 3 భారీ విజయం తో వీడ్కోలు పలకాలని ఆశపడిన శృతి హాసన్ కు ఎస్ 3 విడుదల వాయిదా పడటంతో నిరాశే మిగిలింది.

అయినప్పటికీ తెలుగులో తనకి తొలి భారీ సక్సెస్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన రెండవ సారి కాటమరాయుడి చిత్రంలో నటించే అవకాశం తో పాటు, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న శభాష్ రాయుడు చిత్రంతో తన తండ్రి లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి తెరను పంచుకోవటమే కాక ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం 2016 తనకు కల్పించింది అని మురిసిపోతుంది శృతి హాసన్. తనలోని నటి తన తండ్రిలోని దర్శకుడు కోరుకున్నది ఇవ్వటంలో తనకు సహకరిస్తుంది అని తనని తాను పొగుడుకుంటూ గర్వపడుతుంది శృతి హాసన్. ఇక ఇటీవల 13 సంవత్సరాల సహజీవనం తరువాత గౌతమీ తో తన తండ్రి కమల్ హాసన్ విడిపోవటంపై తన ప్రభావం ఎక్కువ అని శృతి ని ప్రశ్నించగా, "ఇది వరకే గౌతమీ గారు దీని పై పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆవిడ నా ప్రమేయం ఉన్నట్టు ఏమి ఆరోపణలు చేయకపోయినా అటువంటి కల్పిత వార్తలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇక నేను ఎవరి వ్యక్తిగత విషయాలలోనూ కలవజేసుకోను. నాకు ఆ అలవాటు మొదటి నుంచి లేదు. ఇందుకు మా నాన్న జీవితం కూడా మినహాయింపు కాదు. కాబట్టి ఆయన రేలషన్ షిప్స్ గురించి నో కామెంట్స్." అంటూ దాటవేసింది శృతి హాసన్.

Similar News