వర్మ వివాదాస్పద ట్వీట్లను సైతం సమర్ధించిన నాగ్

Update: 2017-02-01 08:25 GMT

రామ్ గోపాల్ వర్మ వెండితెర కు దర్శకుడిగా పరిచయం కావటానికి అతనిలోని కంటెంట్ ని నమ్మి తొలి అవకాశం ఇచ్చిన వ్యక్తి అక్కినేని నాగార్జున. అలానే నాగార్జున కెరీర్ టర్న్ తీసుకోవటానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన శివ సినిమానే కీలకం. నాగార్జున అనేకసార్లు ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ విజన్ కి హాట్స్ ఆఫ్ చెప్తుంటాడు. వర్మ కూడా నాగార్జున గురించి మాట;లాడాల్సి వచ్చినప్పుడు తొలి అవకాశం ఇచ్చిన హీరో కం నిర్మాత గా నాగ్ కి ఆ గౌరవం ఇస్తుంటాడు. వర్మ ఎవరిపైనైనా ప్రేమ చూపిస్తున్నా లేక పొగడ్తలతో ముంచేస్తున్నా అంత సాధారణంగా నమ్మలేము. రాత్రి ప్రేమ పలకరింపులతో ట్వీట్లు చేస్తే తెల్లవారే సరికి అదే వ్యక్తి పై ఆయన ట్వీట్లతో దాడి చేసిన సందర్భాలు ఎన్నో. కానీ నాగార్జున విషయంలో వర్మ తొలి నుంచి ఒకే స్టాండ్ పై కన్సిస్టెంట్ గా వున్నాడు. ఇటీవల జరిగిన శివ టు వంగవీటి జర్నీ వేడుకలో కూడా నాగార్జున మరియు వర్మ శివ సినిమా క్రెడిట్ ని ఒకరికి ఒకరు ఇచ్చుకున్నారు.

ఓం నమో వెంకటేశాయ చిత్రం ఈ నెల 10 న విడుదల కి సిద్ధం అవుతున్న సందర్భముగా ఆ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా నాగార్జున టీవీ చానెల్స్ లో జరిగే ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. ఒక టీవీ ఛానల్ లో నాగ్ ఓం నమో వెంకటేశాయ చిత్ర విశేషాలు ముచ్చటిస్తున్న సమయంలో వర్మ టాపిక్ రాగా, "రామ్ గోపాల్ వర్మ పై నాకున్న ప్రేమ ఎప్పటికీ తరగదు. వర్మ ఇచ్చిన శివ సినిమా వల్లనే నా కెరీర్ మలుపు తిరిగి స్టార్ హీరో అయ్యాను. అలానే ఆ సినిమా ఇప్పటికీ నా కెరీర్లో ప్రత్యేకమైన చిత్రాలలో మొదటి స్థానంలో వుంది." అంటూ వర్మ పై తన కృతజ్ఞతా భావాన్ని మరోసారి బహిరంగ పరిచారు. వర్మ సెలబ్రిటీస్ పై చేస్తున్న ట్వీట్స్ వివాదాస్పదం అవుతున్నాయి కదా అని అడిగిన ప్రశ్న కి సమాధానం గా, "వర్మ తాను అనుకున్నదే మాట్లాడతాడు. అవే ట్విట్టర్ ద్వారా పంచుకుంటారు. ఎవరికైనా ఆ ట్వీట్స్ ఇబ్బందిగా ఉంటే వారు వర్మ ని ఫాలో అవటం మానేయొచ్చు." అంటూ వర్మ ట్వీట్లకు సమర్ధింపుగా మాట్లాడారు నాగార్జున.

Similar News