వర్మ చతుర్లపై స్పందించిన చిరు

Update: 2017-01-10 13:15 GMT

సంచలనాత్మక దర్శకుడు, వివాదాస్పద వ్యక్తి రామ్ గోపాల్ వర్మ నిత్యం తన ట్విట్టర్ లో పోస్ట్ చేసే ట్వీట్ల తో వార్తల్లో నిలుస్తుంటారు. ఆ ట్వీట్లు ఆయన పరిస్థితులపై చేసినా, పరిశ్రమల పై చేసినా, వ్యక్తులపై చేసినా, వ్యవస్థపై చేసినా, ప్రజల విశ్వాసం పై చేసినా, లేక మూఢ నమ్మకాలపై చేసినా ఇలా విషయం ఏదైనప్పటికీ వర్మ ట్వీట్లో వివాదం మాత్రం ఖాయం. ఈ మధ్య ఇరు తెలుగు రాష్ట్రాలలో అధికంగా చర్చించుకుంటున్న విషయాలు మెగా స్టార్ 150 వ సినిమా, బాలయ్య 100 వ సినిమా. ఈ పరిణామాన్ని తన సొంత ప్రయోజనాలకు వాడుకున్నాడో ఏమో కానీ రామ్ గోపాల్ వర్మ గత కొద్దీ రోజులుగా చిరంజీవి చేస్తున్న రీమేక్ పై, ఆయన తాజా పోస్టర్స్ పై వరుసగా తన అభిప్రాయాలను తెలుపుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా జరిగిన ఖైదీ నెం.150 ఫంక్షన్ లో వర్మ పేరు ప్రస్తావించనప్పటికీ మెగా బ్రదర్ నాగ బాబు తెలుగు నుంచి బాంబే వెళ్లిన దర్శకుడు అంటూ సంబోధిస్తూ వర్మ ట్వీట్ల పై విరుచుకుపడ్డారు. నాగ బాబు వేదిక పై వ్యవహరించిన ఈ తీరుపై ఒక ఇంటర్వ్యూ లో స్పందించిన చిరంజీవి, "వర్మ కేవలం నా చిత్రం కాబట్టే అటువంటి మిశ్రమ స్పందన తెలుపుతూ ట్వీట్ చేసాడని నేను అనుకోను. ఆయన అందరి పై తన అభిప్రాయాలను కొంచం ఘాటుగానే వెల్లడిస్తుంటారు కదా. అయితే నాగ బాబు చాలా ఎమోషనల్ వ్యక్తి, ఎక్సప్రెస్సివ్ వ్యక్తి కావటంతో తన మనసులో అనుకున్నది అడిగేశాడు. మా నుంచి అయితే వర్మ ట్వీట్ ల పై ఎటువంటి ప్రతి చర్య కి ఆస్కారం లేదు. ఇది ఇంతటితో ముగిసిపోతుందనే అనుకుంటున్నాను. ఆయన తన అభిప్రాయం వెల్లడించినంత మాత్రాన నేను రీమేక్ కథను ఎంచుకున్నందుకు గాని, సంక్రాంతి పండుగకి నా చిత్రం రిలీజ్ చేస్తున్నందుకు కానీ ఏమి విచారించటం లేదు. అయితే నేను వర్మ వ్యాఖ్యలు పట్టించుకోలేదు కదా అని అందరూ ఒకే తీరున వుండరు కదా. నా అభిమానులలో కొందరు సున్నిత మనస్తత్వం కలిగినవారు, నాగ బాబు లా భావోద్వేగాలను ఆపుకోలేనటువంటి వారు ఉండొచ్చు. అటువంటి వారు నొచ్చుకునే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేయకపోవటమే అందరికి శ్రేయస్కరం." అని వర్మ తీరు పై తన ప్రశాంతత వైఖిరి తెలుపుతూనే వర్మ తీరు సబబు కాదని కూడా పరోక్షంగా చెప్పారు మెగా స్టార్ చిరంజీవి.

Similar News