‘వంగవీటి’పై హైకోర్టులో వారసుడి దావా!

Update: 2016-11-30 15:35 GMT

రామ్‌గోపాల్ వర్మ తాజాగా రూపొందిస్తున్న వంగవీటి చిత్రం ప్రారంభించిన నాటినుంచి రకరకాల వివాదాల్లో కేంద్రబిందువుగా వార్తల్లో సినిమాగా నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి, ఇలాచెప్పడం కంటె.. వివాదంగా ఉండి.. తన మార్కెట్ ను తాను సృష్టించుకుంటుంది అనే ఆలోచన ఉన్నందువల్లనే రాంగోపాల్ వర్మ ఈ చిత్రం తీశారంటే ఇంకా సబబుగా ఉంటుందేమో. ఆ రకంగా వంగవీటి చిత్రం గురించి తొలినుంచి రకరకాల లీకులు ఇస్తూ రాంగోపాల్ వర్మ సంచలనాలు నమోదు చేస్తూనే ఉన్నారు.

మధ్యలో వంగవీటి చిత్రం గురించి తాను ట్వీట్ లు పెట్టిన సందర్భాల్లో కూడా.. రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలను జతచేసి తన సినిమా గురించి ప్రజల్లో చర్చ జరిగేలా జాగ్రత్తలు తీసుకున్న రాంగోపాల్ వర్మ తాజాగా డిసెంబరు 3వ తేదీన సినిమా ఆడియోను విజయవాడలోనే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇలాంటి కీలక దశలో ఆ సినిమా మీద హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. ‘వంగవీటి’ పేరుతో రూపొందుతున్న చిత్రం వాస్తవ విరుద్ధంగా ఉన్నదని, వాస్తవాలకు దూరంగా కల్పితాలతో సినిమాను రూపొందించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ... విజయవాడకు చెందిన వంగవీటి రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ చిత్రం విడుదలను ఆపుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ లో కోరారు.

వంగవీటి చిత్రాన్ని.. రాధాకృష్ణ తండ్రి వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగానే చిత్రీకరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో విజయవాడలో పేరుపడ్డ ముఠా తగాదాలు, కక్షల రాజకీయాలకు ఒకవైపు కేంద్రబిందువుగా వంగవీటి రంగా ఉండేవారని అంతా అంటుంటారు. అలాంటి నేపథ్యంలో రంగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్న సందర్భంలో ఆయనను దారుణంగా హత్య చేశారు. హత్యానంతర పరిణామాల్లో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఆ రకంగా వంగవీటి రంగాకు ఒక సామాజికవర్గంలో హీరో ఇమేజి ఏర్పడింది. ఆయన వారసుడు రాధాకృష్ణ తర్వాతి పరిణామాల్లో ఎమ్మెల్యే కూడా అయ్యారు. అయితే తన తండ్రి జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నట్లుగా ప్రకటించి, వాస్తవాలకు దూరంగా చిత్రీకరణ చేశారని ఆరోపిస్తూ రాధా హైకోర్టును ఆశ్రయించడం విశేషం.

Similar News