రెట్టింపు లాభంతో అనువాద చిత్రం

Update: 2016-12-15 15:22 GMT

అనువాద చిత్రాలలోనే అతి ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా శంకర్-విక్రమ్ ల ఐ నిలిచినప్పటికీ ఆ చిత్రానికి ఖర్చు చేసినా వ్యయం కానీ, తెలుగు అనువాద థియేట్రికల్ హక్కులకై జరిగిన వ్యాపారం కానీ వసూళ్లకు మించిన మొత్తం కావటంతో ఆ చిత్రం విజయం ముంగిట స్థానం కోల్పోయింది. ఆ చిత్రం తరువాత మళ్లీ అనువాద చిత్రాలు అధిక రెవిన్యూ చేయటం విజయ్ ఆంథోనీ నటించిన బిచ్చగాడు చిత్రంతోనే చూసాం. అతి తక్కువ ఖర్చుతో తెలుగు అనువాదం, అనువాద హక్కులు నిర్మాత పొందగా ఆ చిత్రం స్ట్రెయిట్ సినిమాలలో చిన్న సినిమాలు సాధించలేని వసూళ్లు సాధించి ఇక ధాటిగా 100 రోజులు ప్రదర్షింపబడింది.

బిచ్చగాడు సక్సెస్ తో విజయ్ ఆంథోనీ తాజా చిత్రం బేతాళుడు కూడా ఫాన్సీ రేట్లకి అధిక సంఖ్యలో థియేటర్లు పొంది గ్రాండ్ గానే తెలుగు వెర్షన్ విడుదల ఐయింది. కానీ ఈ సారి బేతాళుడు బయ్యర్స్ కి మింగుడుపడని చేదు అనుభవాలే ఎదరు అయ్యాయి. ఇదే సమయంలో విడుదల ఐన మన్యం పులి మాత్రం నిర్మాత సింధూరపువ్వు కృష్ణ రెడ్డికి పెట్టుబడికి రెట్టింపు లాభం సమకూర్చింది. పులి మురుగన్ అనువాద హక్కులు, డబ్బింగ్ మరియు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కలిపి కోట రూపాయలు వెచ్చించగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర కోట్ల రూపాయల షేర్ వసూళ్లు చేసింది. ఇంకా శాటిలైట్ హక్కులు చేతిలో ఉండటంతో నిర్మాతకు రూపాయి పెట్టుబడికి రెండు రూపాయల లాభం కచ్చితంగా కనపడుతుంది.

విజయ్ ఆంథోనీ ఒక చిత్రం ఆడటంతో తదుపరి చిత్రానికి థియేట్రికల్ రైట్స్ భారీగా పెంచేయటంతో పంపిణీదారులు, కొనుగోలుదారులు తీవ్రంగా నష్ట పోయారు. ఇలా గతంలోనూ ఒక చిత్రం ఆడితే ఆ హీరో చిత్రాలు వరుసగా ఫాన్సీ రేట్లకు అమ్మి ఆయా హీరోల మార్కెట్లు సుస్థిరం కాలేని తప్పిదాలు చేశారు నిర్మాతలు. ఇక నుంచి అయినా అనువాద చిత్రాలలో ఈ వ్యాపార ప్రక్రియ మారుతుంది అని ఆశిద్దాం.

Similar News