రెండు సంవత్సరాలలో 9 సినిమాలు నిర్మిస్తా

Update: 2017-01-29 22:30 GMT

నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టటమే కళా తపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సీత కథ చిత్రం తో పరిశ్రమలో తొలి ప్రయత్నంతోనే భారీ సక్సెస్ అందుకున్నారు చలసాని అశ్విని దత్. అశ్విని దత్ వైజయంతి మూవీస్ సంస్థ స్థాపించి రామారావు పీక్స్ టైం నడుస్తున్న రోజులలో రామారావు కాల్ షీట్స్ సంపాదించి ఎదురులేని మనిషి, యుగ పురుషుడు చిత్రాలు నిర్మించి ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నారు. నాటి నుంచి వరుసగా భారీ వ్యయాలతో కూడుకున్న చిత్రాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాత గా కొనసాగిన అశ్విని దత్ కి తారక్-మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో వచ్చిన శక్తీ చిత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. 2011 లో శక్తీ విడుదలైన అనంతరం నేటి వరకు ఆయన చిత్ర నిర్మాణం చేపట్టలేదు. ఇందుకు శక్తీ మిగిల్చిన ఆర్ధిక నష్టాలు ఒక కారణం కాగా ఆయన నమ్మిన సిద్ధాంతి సలహా మరొక కారణమని అశ్విని దత్ ఇటీవలి కాలంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

తాజాగా తిరుపతి లో శ్రీ వారిని దర్శించుకున్న అశ్విని దత్ మీడియా తో మాట్లాడుతూ, "ఈ ఏడాది, వచ్చే ఏడాది వరుసగా సినిమాలు నిర్మిస్తాను. ఈ రెండు సంవత్సరాలలో వైజయంతి మూవీస్ నుంచి తొమ్మిది చిత్రాలు రానున్నాయి. వీటిల్లో వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు తో నిర్మించబోయే చిత్రం తో పాటు నాగార్జున, తారక్, నాని లతో తీయబోయే చిత్రాలు వున్నాయి. మెగా స్టార్ చిరంజీవి 152 వ సినిమా కూడా నేను నిర్మించాలనుకుంటున్నాను. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలో వుంది. వీటన్నిటి కంటే ముందుగా సావిత్రి గారి జీవితంపై తీస్తున్న బయోపిక్ 'మహా నటి' విడుదల అవుతుంది. 2018 ఆఖరు వరకు మళ్లీ వైజయంతి వైభవాన్ని చూస్తారు." అని వైజయంతి మూవీస్ చేపట్టనున్న తదుపరి ప్రాజెక్ట్స్ పై పూర్తి విశ్వాసంతో మాట్లాడారు అశ్విని దత్.

Similar News