రాజకీయాలలో విఫలమయ్యాక కూడా సినిమా స్టార్ గా ఓ వెలుగు వెలగొచ్చు

Update: 2017-03-16 08:33 GMT

మెగా స్టార్ చిరంజీవి తన తొమ్మిది సంవత్సరాల విరామం తరువాత తిరిగి కథానాయకుడిగా నటించిన తన 150 వ చిత్రం ఖైదీ నెం.150 ప్రాజెక్ట్ సెట్ చేసుకోవటానికి సమయం తీసుకున్నారు కానీ ఒక సారి కన్ఫర్మ్ అయ్యాక మాత్రం చెప్పిన సమయానికే సినిమా విడుదల చేశారు. ఇప్పుడు 151 గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ అనే బయోపిక్ కి రంగం సిద్ధం చేసుకుంటూనే 152 వ సినిమాకి బోయపాటి శ్రీనుతో కథా చర్చలు జరుపుతున్నారు. మరో వైపు బాల కృష్ణ తన 101 వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొదలు పెట్టి, 102 వ చిత్రంగా కే.ఎస్.రవి కుమార్ పరిశీలనలో ఉంచారు. పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు పూర్తి చేసి ఇప్పుడు త్రివిక్రమ్ మరియు నీసన్ ల దర్శకత్వంలో తెరకెక్కబోయే రెండు సినిమాలను సమాంతర కాలంలో పూర్తి చేయనున్నాడు.

ఒకప్పుడు ఏడాదికి ఒక్క చిత్రం మాత్రమే విడుదల చేసే స్టార్ హీరోస్ కూడా ఇప్పుడు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలను టార్గెట్ చేసుకుంటుండటంతో వీరు రానున్న రెండు సంవత్సరాలలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి 2019 ఏడాది పూర్తిగా ఎన్నికల ప్రచారాలు, రాజకీయ పార్టీ మీటింగ్స్ తో బిజీ కానున్నారని మీడియా లో వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోస్ పై వస్తున్న ఈ వార్తలకి హర్ట్ ఐన పెద్దాయన తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ, "చిరంజీవి, బాలయ్య గతంలో కూడా ఏడాదికి మూడు విడుదలలు చేసిన సందర్భాలు అనేకం వున్నాయి. అప్పుడు పట్టించుకోని మీడియా ఈ పరిణామాన్ని ఇప్పుడు పట్టించుకుని స్టార్స్ పై ఇంత దుష్ప్రచారం ఎందుకు చేస్తుందో అర్ధం కావటం లేదు. స్టార్స్ ఎక్కువ సినిమాలు చేయటం వల్ల లాభమే కానీ ఎవరికీ నష్టం లేదు. రాజకీయాలలో చురుగ్గా వ్యవహరిస్తూనే యాక్టింగ్ కూడా కొనసాగించొచ్చు కదా. ఒకవేళ రాజకీయాలలో ఫెయిల్ అయినా సినిమా ప్రపంచం లో ఓ వెలుగు వెలిగే అవకాశాలు దక్కొచ్చు. యాక్టర్స్ కం పొలిటిషన్స్ గా పనిచేస్తున్న వారి ప్రతి కదలికని వార్తగా మలచాలని ప్రయత్నించొద్దు. చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ అందరూ రెండు పడవలపై ఏకకాలంలో ప్రయాణిస్తున్నా వారి సామర్ధ్యంతో వారు రెంటినీ జాగ్రత్తగా సమన్వయ పరచుకుంటున్నారు." అని అగ్ర హీరోలకు తన మద్దతు తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ్.

Similar News