మోక్షజ్ఞ పరిచయ చిత్రం నిర్మించేది నేనే అంటున్నాడీ నిర్మాత

Update: 2017-01-13 10:23 GMT

గత కొంత కాలంగా నందమూరి వంశ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసింది నట సింహం నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం. ఆ చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. బాలయ్య 100 వ చిత్ర విజయం అభిమానులను ఆనందోత్సాహాలలో ముంచేస్తున్నప్పటికీ వారికి బాల కృష్ణ ను మరో విషయమై స్పష్టమైన జవాబు రాలేదు. డిక్టేటర్ విడుదల సమయంలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ పేరు బాగా వార్తల్లో నిలిచింది. 2017 లో బాలయ్య 100 వ చిత్రంతో పాటు మోక్షజ్ఞ పరిచయ చిత్రం కూడా విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగింది. కాగా మోక్షజ్ఞ లాంచ్ విషయమై బాలయ్యని ఎప్పుడు ప్రశ్నించినా అందుకు ఇంకా సమయం వుంది అంటూ దాట వేసేవారు.

గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందుతుండటంతో ఇక నందమూరి అభిమానుల ఫోకస్ మోక్షజ్ఞ పరిచయ చిత్రం పై పడింది. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఉత్తరాంధ్ర, సీడెడ్ ప్రాంతాలలో పంపిణీ చేసిన ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయి, మీడియా తో ఈ చిత్ర విజయానందాన్ని పంచుకుంటూ, మోక్షజ్ఞ పరిచయ చిత్రం పై కూడా పెదవి విప్పారు. "మోక్షజ్ఞ లాంచ్ మా నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర ద్వారానే జరుగుతుంది. బాలయ్య బాబు నుంచి నేను ఏడాది క్రితమే మోక్షు తొలి చిత్రానికి మాట తీసుకున్నాను. అయితే ఆ చిత్రం ఈ ఏడాదే వస్తుంది అనేది కేవలం ఊహాగానమే." అంటూ అభిమానుల ఆశల పై నీళ్లు జల్లారు కొర్రపాటి సాయి. మరి మోక్షు కోసం కథ చర్చలు జరుగుతున్నాయా అన్న ప్రశ్నకు కూడా నేరుగా సమాధానమివ్వకుండా దాట వేశారు సాయి కొర్రపాటి.

Similar News