మొత్తానికి విజయ్ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి

Update: 2017-04-06 07:29 GMT

ఎవడె సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు చిత్రాలతో ప్రేక్షకులకి చేరువైన యువ నటుడు విజయ్ దేవరకొండ నటించిన ద్వారకా చిత్రం గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం చెందినప్పటికీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న అర్జున్ రెడ్డి చిత్రంపై మంచి అంచనాలని ఏర్పరిచింది ఆ మధ్య విడుదలైన ఆ చిత్ర టీజర్. అయితే ఆ అంచనాల వేడి కొనసాగుతుండగానే సినిమాని పూర్తి చేసి కాష్ చేసుకోలేకపోయారు అర్జున్ రెడ్డి నిర్మాతలు. క్రమంగా ప్రేక్షకుల దృష్టికి దూరం అవుతుంది ఈ చిత్రం. అయితే పెళ్లి చూపులు కంటే ముందుగా చిత్రీకరణ ప్రారంభం ఐన అర్జున్ రెడ్డి చిత్రం ప్రారంభం నాటికి చాలా చిన్న చిత్రం అయినప్పటికీ పెళ్లి చూపులు తరువాత హీరో విజయ్ దేవరకొండకి పెరిగిన క్రేజ్ కారణంగా బడ్జెట్ లో నిర్మాతఃలకి కొద్దిగా లిబర్టీ లభించినట్టుంది.

ముందుగా వేసుకున్న ప్రణాళికలో విదేశీ లొకేషన్స్ ప్లాన్ ఏది లేనప్పటికీ ఇప్పుడు డెహ్రాడూన్, మంగళూరు వంటి ఇండియన్ లొకేషన్స్తో పాటు ఇటలీ దేశంలోని కొన్ని అందమైన లొకేషన్స్ లోకూడా చిత్రీకరణ చేసుకుని వచ్చారట అర్జున్ రెడ్డి బృందం. ఇప్పటికే టీజర్ విడుదలై చాలా కాలం అయినప్పటికీ చిత్రానికి సంబంధించిన తదుపరి అప్డేట్ వెలువడకపోవటానికి అనుకోకుండా ఏర్పడ్డ షూటింగ్ షెడ్యూల్స్లోని ఈ మార్పులే కారణమని అంటున్నారు నిర్మాతలు. అయితే ప్రస్తుతం చిత్రీకరణ దశని దాటుకుని డబ్బింగ్ కార్యక్రామాలు ప్రారంభం అయ్యాయట. త్వరలోనే ట్రైలర్ కట్ చేసి ట్రైలర్ విడుదలతోపాటు సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత ఇస్తామంటున్నారు నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ.

Similar News