మూడో సారి బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ ఆమెదే

Update: 2016-11-14 12:15 GMT

దక్షిణ సినిమాల్లో ఎన్నో ఏళ్ళు కష్టపడితే తప్ప హిందీ చిత్రాల అవకాశాలు దక్కేవి కావు గతంలో. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి, దర్శక నిర్మాతల ఆలోచనా ధోరణి, పెరుగుతున్న సినిమా వ్యాపార వ్యవహారాల కారణాన ఇప్పుడు కథానాయికలకు హిందీ అవకాశాలు అనుకున్న దాని కన్నా త్వరగానే దక్కుతున్నాయి. కానీ ఒక్క అవకాశంతో బాలీవుడ్ కెరీర్ ప్రారంభం అవుతుంది కానీ చాలా మంది నటీమణులకు తదుపరి అవకాశాల కొరత తీవ్రంగా పరీక్ష పెడుతుంది. ఇప్పుడు పూజ హెగ్డే పరిస్థితి కూడా ఇదే.

తమిళం లో ఒక చిత్రం, తెలుగు లో రెండు చిత్రాలు చేసిన వెంటనే హిందీ సినిమా అవకాశం అందులోనూ హ్రితిక్ రోషన్ సరసన నటించే అవకాశం కావటంతో నేరుగా ముంబైలో ల్యాండ్ అయిపోయింది పూజ హెగ్డే. కానీ పూజ నటించిన ఏకైక హిందీ చిత్రం మొహెంజొదారో ఘోర పరాజయం పొంది పూజ హెగ్డే ఆశలపై నీళ్లు జల్లింది. కాకపోతే ఆ చిత్రం వలన పూజ హెగ్డే కి దక్కిన ప్రయోజనం ఏంటంటే మూడవ సారి బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు దక్కటం. డెబ్యూ అంటేనే మొదటి చిత్రం మరి మూడవ సారి ఆ అవార్డు రావటం ఏంటనుకుంటున్నారా? పూజ హెగ్డే తమిళంలో నటించిన ముంగమూడి చిత్రానికి, తెలుగులో తన పరిచయ చిత్రం ముకుంద చిత్రానికి ఇదివరకే ఆ అవార్డులు దక్కించుకుంది. ఇప్పుడు లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్లో పూజ కు హిందీలోనూ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు రావటం విశేషం.

Similar News