మూడు సంవత్సరాల తరువాత విడుదలకు

Update: 2016-12-16 11:33 GMT

రామారావు, నాగేశ్వర రావు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, బాల కృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా రెండు తరాల అగ్ర కథానాయకులకు మర్చిపోలేని విజయాలు అందించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావ్ నేటి తరం కథానాయకులతోనూ సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వంటి పలువురు ప్రముఖులు వారి వారసులను వెండి తెరకు పరిచయం చేయటానికి రాఘవేంద్ర రావ్ నే నమ్ముకున్నారు. రాజకుమారుడు, గంగోత్రి చిత్రాలతో వెండితెరకు కథానాయకులు గా పరిచయమైన మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇవాళ తెలుగు లోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు.

స్వర్గీయ దర్శకులు బాపు తెరకెక్కించిన శ్రీ రామ రాజ్యం చిత్రాన్ని నిర్మించిన యలమంచిలి సాయి బాబు తన తనయుడు యలమంచిలి రేవంత్ ను కథానాయకుడిగా పరిచయం చేయటానికి కూడా భక్తి రస చిత్రాన్నే నిర్మించారు. రాఘవేంద్ర రావ్ దర్శకత్వంలో పరిచయమైతే గుర్తింపు సులభంగా వస్తుంది అని స్టార్ హోదా తెచ్చుకోవటం సులభం అవుతుంది అని నమ్మిన యలమంచిలి సాయి బాబు ఆయన దర్శకత్వంలో రేవంత్ హీరోగా ఇంటింటా అన్నమయ్య చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మూడు సంవత్సరాల క్రితమే విడుదల కి సిద్దమైనప్పటికీ ఫైనాన్సియర్స్ కి తీర్చాల్సిన మొత్తం ఇంకా ఉండటంతో ఇంటింటా అన్నమయ్య విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రాన్ని అందరూ మర్చిపోయిన తరుణంలో శ్రీశైలం దేవాలయాన్ని సందర్శించిన రేవంత్ తన చిత్రం విడుదలకు రంగం సిద్దమవుతుంది అని, త్వరలో సరైన స్లాట్ చూసుకుని విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపాడు. ఇంత కాలం తరువాత ఈ భక్తిరస చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ మాత్రం ఉంటుందో మరి.

Similar News