మిల్కీ బ్యూటీ కి నిరూపించుకునే అవకాశం దక్కింది

Update: 2016-11-30 04:35 GMT

యువ స్టార్ హీరోస్ అందరితో ఆడి పాడిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బాలీవుడ్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి తహతహలాడి ఎంత వేగంగా వెళ్లిందో అంతే వేగంగా బాలీవుడ్ నుంచి వైఫల్యాలతో వైదొలిగింది. అయితే తమన్నా కి బాలీవుడ్ అధిక పారితోషికాల విషయంలో ఉపయోగపడింది. ఇక్కడి పారితోషికాల కన్నా హిందీ లో పారితోషికాలు ఎక్కువ ఉండటంతో చిత్రాలు ఆడకపోయినా బాగానే మూటకట్టుకుని వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక అంతటి పారితోషికాలు మన నిర్మాతలు భరించలేని పరిస్థితి. అత్యంత తక్కువ కాల్ షీట్స్తో ఎక్కువ మొత్తం సంపాదించే పనిలో పడింది కూడా అందుకే. ఇటీవల తమన్నా ఐటెం సాంగ్స్ లో మెరవటానికి, ప్రైవేట్ వేడుకలలో చిందులు వేయటానికి ఇదే కారణం.

పారితోషికాల మాటున తమన్నా అభినయం మరుగున పడిపోయింది కానీ, ఊసరవెల్లి లాంటి కమర్షియల్ హీరో సినిమాలోనూ తమన్నా తన నటనతో మెప్పించగలిగింది అంటే సాధారణ విషయం కాదు. అటువంటి పాత్రలకు విమర్శకుల ప్రశంసలు ఎన్నో అందుకుంది తమన్నా. ఇటీవల అభినేత్రి చిత్రంతో నటనకు ఆస్కారం వున్న పాత్ర దక్కినప్పటికీ ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. అయినప్పటికీ తమన్నా తన పూర్వ వైభవం కథానాయికగా తిరిగి తెచుకోవటానికి ఒక సదావకాశం దక్కింది. బాలీవుడ్ లో కంగనా రనౌత్ ని విజయ శిఖరాల పై నిలిపిన క్వీన్ చిత్ర తెలుగు తమిళ రీమేక్ కు తమన్నా ఎంపిక ఐయ్యింది. కథానాయిక పాత్ర చుట్టూ సాగే ఈ కథలో నటించిన కంగనాకు 2013 జాతీయ పురస్కారం లభించిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. ఐటెం భామ గా మారిపోయిన తమన్నా ఈ అవకాశం ఎలా సద్వినియోగ పరుచుకుంటుందో చూడాలి.

Similar News