మానవ సంబంధాలను స్పృశించే కథలంటే ఇష్టం

Update: 2017-03-03 06:50 GMT

గత ఏడాది పెళ్లి చూపులు సాధించిన విజయంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారికి విజయ్ దేవరకొండ పేరుతో పాటు ముఖం కూడా రిజిస్టర్ అయిపోయింది. ఆ చిత్రం తెలుగు రాష్ట్రాలలో సాధించిన విజయానికి సమాన స్థాయిలో ఓవర్ సీస్ మార్కెట్లో విజయం సాధించింది. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో కథానాయకుడు నాని కి స్నేహితుడిగా ఋషి పాత్రలో నటించి మెప్పించిన నాటి నుంచి విజయ్ దేవరకొండ ప్రేక్షకులకి కొద్దిగా తెలుసు కానీ అంతకు ముందు ఎంతో కాలంగా నటుడిగా నిలదొక్కుకునే బ్రేక్ కోసం అవకాశాల అన్వేషణలో ఎంతో కాలం గడిపాడు విజయ్ దేవరకొండ. ఆ సమయంలోనే నటుడిగా అవకాశాలు దక్కకపోతే దర్శకత్వం వైపు ప్రయత్నాలు సాగించాలని నిర్ణయించుకుని కథలు కూడా సిద్ధం చేసుకున్నాడట.

పెళ్లి చూపులు సాధించిన సూపర్ సక్సెస్ తరువాత విజయ్ దేవరకొండ కి హీరోగా ద్వారకా, అర్జున్ రెడ్డి చిత్రాలతో పాటు మరో ఐదు చిత్రాల అవకాశాలు తలుపు తట్టటంతో ప్రస్తుతానికైతే నటుడిగా ఫుల్ బిజీగా వున్నాడు విజయ్ దేవరకొండ. అయితే రానున్న కాలంలో దర్శకుడిగా కూడా రాణిస్తానని చెప్తున్నాడు ఈ కుర్ర హీరో. తనకి మానవ సంబంధాల చుట్టూ తిరిగే కథలు అంటే ప్రత్యేకమైన ఆసక్తి అని చెప్తున్నా ఈ హీరో, కొంత కాలం కిందట హాస్టల్ లో వుండే నలుగురు ప్రధాన పాత్రల చుట్టూ సాగే ఎమోషనల్ ట్రావెల్ కథని త్వరలో డైరెక్ట్ చేస్తాడట. అయితే తాను తెరకెక్కించే సినిమాలలో ఎట్టి పరిస్థితుల్లో నటించకూడదని నిబంధన తనకి తాను విధించుకున్నాడట విజయ్ దేవరకొండ.

Similar News