మాట తప్పిన రాజమౌళి...!

Update: 2016-03-04 13:27 GMT

అనుకున్నదే జరిగింది. 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం ఈ ఏడాది రావడం లేదని ఖరారైంది. 'బాహుబలి-ది బిగినింగ్‌' చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి సంచలనాలు క్రియేట్‌ చేయడంతో అంతకు ముందు అనుకున్న స్క్రిప్ట్‌కు రాజమౌళి మెరుగులు దిద్దాడు. మొదటి భాగానికి ఇంత గొప్ప రెస్పాన్స్‌ వస్తుందనే విషయాన్ని ఊహించలేకపోయిన దర్శకధీరుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే విషయాన్ని వచ్చే ఏడాదిలోనే రివీల్‌ చేయనున్నాడు. పెరిగిన అంచనాలకు తగ్గట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు, మొదటిభాగం కంటే మరింత ఉన్నత స్థాయిలో సెట్టింగ్స్‌, గ్రాఫిక్స్‌ వంటివాటిని ఉండేవిధంగా చూసుకోవాలని భావిస్తున్న జక్కన ఈ చిత్రం షూటింగ్‌ మొదలుపెట్టడమే ఆలస్యంగా మొదలుపెట్టాడు. ఎంతో ముందుగా షూటింగ్‌ను మొదలుపెట్టాలని భావించినప్పటికీ ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే సమయానికి డిసెంబర్‌ అయింది. కాగా ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఒకేసారి అంటే ఇప్పటినుండి మరో ఏడాది తరువాత 2017, ఏప్రిల్‌ 14న గుడ్‌ఫ్రైడే రోజున విడుదల చేయనున్నట్లు ఈ చిత్రానికి బాలీవుడ్‌ నిర్మాత అయిన కరణ్‌జోహార్‌, బాలీవుడ్‌ పాపులర్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరుణ్‌ ఆదర్శ్‌లు ట్విట్టర్‌లో తెలియజేశారు.మొదటిభాగం విషయంలోలాగా మొదట ఒక డేట్‌ను తొందరపడి ప్రకటించి, ఆ తర్వాత మరలా విడుదల తేదీని మార్చడం కంటే ముందుగానే రిలీజ్‌ డేట్‌ విషయంలో కాస్త ఎక్కువ గ్యాప్‌ ఉండేలా చూసుకోవడం, ఆ తేదీని లాక్‌ చేయడం వల్ల తెలుగులోనే కాదు... హిందీలో కూడా ఆ సినిమాకు మరో సినిమా పోటీ రాకుండా జాగ్రత్త పడటం కోసం రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థం అవుతోంది. అంతేగాక మొదటి భాగం

షూటింగ్‌లోనే రెండోపార్ట్‌కు సంబంధించిన కొంత భాగం షూటింగ్‌ జరిగింది. కానీ పెరిగిన అంచనాల వల్ల ఆ పాత సీన్స్‌ను తీసివేసి మరలా ఫ్రెష్‌గా తీయాలనే నిర్ణయం కూడా దీనికి మరో కారణంగా చెబుతున్నారు.

Similar News